నెట్‌వర్క్‌ లేక.. రిజిస్ట్రేషన్లు పూర్తవక | - | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌ లేక.. రిజిస్ట్రేషన్లు పూర్తవక

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

నెట్‌వర్క్‌ లేక.. రిజిస్ట్రేషన్లు పూర్తవక ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం నలుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ యువకుడిపై హత్యాయత్నం క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలి

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో బుధవారం నెట్‌వర్క్‌ లేకపోవడంతో భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ల కోసం సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రేల్‌టెల్‌ నెట్‌ కనెక్షన్‌తో అనుసంధానమై రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, బుధవారం రేల్‌టెల్‌ కేబుల్‌ కట్‌ అవడంతో నెట్‌ రాక ఒక్క దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోలేదు. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతులు చేయించడంలో విఫలమవడంతో 108 స్లాట్‌ బుకింగ్స్‌ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. 108 స్లాట్‌ బుకింగ్స్‌ చేసుకున్న భూక్రయవిక్రయదారులు తమకు కేటాయించిన స్లాట్‌ బుకింగ్‌ సమయానికి వరంగల్‌ ఆర్‌ఓకు చేరుకుని వేచి ఉండి రిజిస్ట్రేషన్‌ అవకపోవడంతో రీ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోక తప్పదంటూ నిరాశతో వెనుదిరిగారు.

హసన్‌పర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోందని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. హసన్‌పర్తి మండలం జయగిరి, అన్నాసాగరం గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాంను ఆయన పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఆయుష్‌ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, వెన్నెల, డాక్టర్‌ శ్రీరాం భార్గవ్‌, డాక్టర్‌ మల్లేశం, హెల్త్‌ సూపర్‌వైజర్‌ లచ్చు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.ఫణింధర్‌ వీఆర్‌ నుంచి నెక్కొండ సర్కిల్‌, ఎస్‌.శ్రీనివాస్‌ నెక్కొండ సర్కిల్‌ నుంచి వీఆర్‌ వరంగల్‌, జె.శంకర్‌రావు వీఆర్‌ వరంగల్‌ నుంచి దుగ్గొండి సర్కిల్‌, ఎం. సాయిరమణ దుగ్గొండి సర్కిల్‌ నుంచి వీఆర్‌ వరంగల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండే ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి పెట్రోల్‌ పోసి హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటన కాజీపేటలో చర్చనీయాంశంగా మారింది. యువకుడు మాతంగి ప్రవీణ్‌ తన తల్లితో కలిసి రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్వార్టర్స్‌కు వచ్చి కిటికి నుంచి లోపలికి పెట్రోల్‌ పోశారు. ఆ సమయంలో ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌ చూస్తూ మెలకువతో ఉండడం వల్ల పెట్రోల్‌ వాసనను పసిగట్టాడు. గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితుడు 100 డయల్‌కు ఫోన్‌ చేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుల కోసం గాలించారు. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియాన్ని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ గుగులోతు అశోక్‌కుమార్‌ బుధవారం సందర్శించారు. స్టేడియంలోని క్రీడావసతులు, క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు, క్రీడా పాఠశాల నిర్వహణ, క్రీడా అకాడమీల కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. అనంతరం డీఎస్‌ఏ ఆఫీస్‌లో హనుమకొండ డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ అధ్యక్షతన కోచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గుగులోత్‌ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్‌, రాయబారపు నవీన్‌కుమార్‌, కూరపాటి రమేశ్‌, శ్రీమాన్‌, దేవిక, జీవన్‌గౌడ్‌, ప్రభుదాస్‌, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాజారపు రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement