ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

Aug 20 2026 7:26 AM | Updated on Aug 20 2026 7:26 AM

ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి

చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ను పరిశుభ్రమైన, పచ్చదనం నిండిన నగరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని హనుమకొండ కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్‌ అధికారులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఇళ్ల నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు సమన్వయంతో పనిచేసి రాబోయే ఐదేళ్లలో నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలన్నారు. పరిశోధన, సాంకేతిక సహకారం అందించేందుకు ఎంఎస్‌ స్వామినాథ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, ఐఐటీ మద్రాస్‌, శ్రీచర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ముందుకొచ్చినట్లు తెలిపారు.

ప్రతీ ఓటరు హక్కును పరిరక్షిస్తాం

జిల్లాలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని హనుమకొండ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ కాని ఓటర్లు, అనామలీస్‌ గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాపై వచ్చే ప్రతీ క్లెయిమ్‌, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్‌, వెంకన్న, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, సంబంధిత అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement