గుంతలు.. కుదుపులు! | - | Sakshi
Sakshi News home page

గుంతలు.. కుదుపులు!

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

గుంతలు.. కుదుపులు!

హన్మకొండ: హనుమకొండ బస్‌స్టేషన్‌ గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గుంతల నుంచి బస్సులు వెళ్తుండడంతో కుదుపులకు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు పొరుగున ఉన్న కరీంనగర్‌, సిద్దిపేట జిల్లా ల ప్రయాణికులకు సేవలందిస్తున్న హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌ ఆవరణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై గుంతలు ఏర్పడి ఇబ్బంది పడే ప్రయాణికులు బస్‌స్టేషన్‌లో భారీస్థాయిలో గుంతలు పడడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు రెండు వేల కు పైగా బస్సులు హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ కు వచ్చి వెళ్తుంటాయి. దాదాపు 60 వేల మంది ఈ బస్‌స్టేషన్‌ నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్తారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌ నిర్వహణను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు.

మరమ్మతులకు గురవుతున్న బస్సులు

బస్‌స్టేషన్‌లో ఏర్పడిన గుంతలతో బస్సులు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గుంతల్లో నుంచి బస్సులు వచ్చి వెళ్తుండడంతో బస్సుల టైర్లు పగిలిపోవడంతో పాటు మెయిన్‌లు, కమాన్‌ పట్టీలు విరిగి సంస్థకు నష్టం కలుగుతోంది. ఒక్కోసారి ఆర్టీసీ అధికారులు టైర్లు పగిలినా, మెయిన్‌, కమాన్‌ పట్టీలు విరిగితే నిర్లక్షపు డ్రైవింగ్‌ అని తమపై పెనాల్టీలు విధిస్తున్నారని డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. పెనాల్టీలను కోత పెట్టడంతో తమకు వచ్చే జీతం సరిపోవడం లేదని వాపోతున్నారు. మరో వైపు అద్దె బస్సు యజమానులు కూడా తమ బస్సుల మెయిన్‌లు, కమాన్‌ పట్టీలు విరిగి నష్టం జరుగుతోందని, తమకు వచ్చిన లాభం అంతా మరమ్మతులకే పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ, సౌకర్యాల కల్పనపై లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి బస్‌స్టేషన్‌ను బాగు చేయాలని, గుంతలు పడుకుండా శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా బస్‌స్టేషన్‌ ఆవరణను తీర్చిదిద్దాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అధ్వానంగా హనుమకొండ ఆర్టీసీ బస్‌స్టేషన్‌

బస్సుల కుదుపుతో

ప్రయాణికుల అవస్థలు

పగులుతున్న టైర్లు, విరుగుతున్న మెయిన్‌లు, కమాన్‌ పట్టీలు

బస్సులకు మరమ్మతులు వస్తే

డ్రైవర్ల వేతనాల్లోంచి కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement