● భద్రకాళి దేవాలయంలో ఏర్పాట్లు చేసిన అధికారులు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి ఆలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు.
ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో ప్రారంభం..
ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి.
ఉదయం, సాయంత్రం కాళీ క్రమాల్లో పూజలు
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతీ క్రమానికో ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, నిత్యా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా క్రమం, 26న బలాకా క్రమం, విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు.
29న శాకంబరీగా అలంకరణ..
ఈ నెల 29న ఉదయం 4 గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.


