తీరాలు దాటి.. సేవలో మేటి.. | - | Sakshi
Sakshi News home page

తీరాలు దాటి.. సేవలో మేటి..

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

రిక్షా కార్మికుడి కుమారుడికి జమైకా జాతీయ పురస్కారం ప్రదానం వైద్య, సామాజిక సేవలకుగాను డాక్టర్‌ చందోలు నాగేంద్రబాబుకు గౌరవం గతంలో ఆయన సోదరుడికి అదే దేశంలో జాతీయ పురస్కారం

చందోలు సోదరుల ఘనత

రేపల్లె: ఒకప్పుడు రిక్షా కార్మికుడిగా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. అయినా ఆ తండ్రి కన్న కలలు మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. తనలా తన కుమారులు పేదరికంలో మిగిలిపోకూడదని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. తండ్రి ఆశయాన్ని నిజం చేస్తూ ఇద్దరు కుమారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వారిలో ఒకరైన డాక్టర్‌ చందోలు నాగేంద్రబాబుకు తాజాగా జమైకా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని అందించింది. బాపట్ల జిల్లా నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం కరేబియన్‌ తీరాల వరకు సాగడం విశేషం.

జేఎన్‌వీ మద్దిరాల నుంచి...

నగరం మండలం బోరమాదిగపల్లి అనే కుగ్రామంలో అత్యంత పేదరికంలో జీవించిన తండ్రి దేవదాసు.. తన కుమారులు ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కన్నారు. తల్లిదండ్రులు దేవదాసు, సుభాషిణి ప్రోత్సాహంతో నాగేంద్రబాబు ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయంలో పూర్తి చేశారు. తర్వాత వైద్య విద్యను అభ్యసించారు. జమైకాకు వెళ్లి తన కుమారుడి పేరుతో ‘ఆశిష్‌ హెల్త్‌ కేర్‌’ ఆసుపత్రిని స్థాపించారు. భార్య డాక్టర్‌ దారం అలేఖ్యతో కలిసి లాభాపేక్షకు అతీతంగా వైద్య సేవలు అందిస్తూ స్థానిక ప్రజల అభిమానాన్ని సంపాదించారు.

కన్నీళ్లు తుడిచి...

వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న రోజుల్లోనూ సేవే లక్ష్యంగా నాగేంద్రబాబు జమైకాలోని సెయింట్‌ మేరీ ప్రాంత నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వందలాది మంది పేద విద్యార్థులు, వృద్ధులకు మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అలమటించిన స్థానికుల ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు అందించడంతో పాటు, నడవలేని వృద్ధులకు వీల్‌చైర్లు, వాకర్లు పంపిణీ చేశారు. జమైకాతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేయూతనందిస్తున్నారు.

స్నేహానికి తెలుగు వారధి..

భారత రాష్ట్రపతి జమైకా పర్యటన సందర్భంగా రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లోని ఇండియా–జమైకా ఫ్రెండ్‌షిప్‌ గార్డెన్‌లో గెజిబో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో నాగేంద్రబాబు నేతృత్వంలోని ఆశిష్‌ కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సొంత ఖర్చులతో కేవలం వారం రోజుల్లోనే దానిని పునర్నిర్మించింది. తద్వారా భారత్‌–జమైకా స్నేహ సంబంధాల బలోపేతానికి తనవంతు కృషి చేశారు. జమైకా ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక బ్యాడ్జ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పురస్కారాన్ని గవర్నర్‌ జనరల్‌ సర్‌ పాట్రిక్‌ అలెన్‌ చేతుల మీదుగా నాగేంద్రబాబు అందుకున్నారు. 2026 అక్టోబర్‌ 19న జమైకా జాతీయ వీరుల దినోత్సవం సందర్భంగా కింగ్స్‌ హౌస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జమైకా స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 6న ఈ అవార్డుకు ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకలో ఆయన వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి అవార్డును స్వీకరించారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది. ఎక్కడ ఉన్నా తన మూలాలను మరచిపోననే సందేశాన్ని ఆయన తన ఆహార్యంతో చాటిచెప్పారు.

ఈ కుటుంబ విజయగాథలో మరో విశేషం ఉంది. నాగేంద్రబాబు సోదరుడు డాక్టర్‌ నాగమల్లేశ్వరరావు చందోలు గతంలో కేవలం 500 జమైకన్‌ డాలర్లకే వైద్యం అందిస్తూ అక్కడి ప్రజలచే ‘ఫైవ్‌ బిల్స్‌ డాక్టర్‌’గా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన జమైకా ప్రభుత్వం ఆర్డర్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌ పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న తమ్ముడు నాగేంద్రబాబు బ్యాడ్జ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పురస్కారాన్ని అందుకున్నారు. పేదరికంలో పుట్టినా పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, సంపాదనతో పాటు సేవాభావం కూడా మనిషికి గొప్ప గుర్తింపును తెస్తుందని చందోలు సోదరులు నిరూపించారు. వారి విజయంపై బాపట్ల జిల్లా ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement