మైనారిటీలకు టీడీపీలో అవమానాలు | - | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు టీడీపీలో అవమానాలు

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

● ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌ను పక్కకు తొలగమన్న ఎమ్మెల్యే ● సామాజిక మాధ్యమాల్లో నసీర్‌ అహ్మద్‌ను నిలదీస్తున్న మైనారిటీలు

పార్టీకి దూరంగా మరో కీలక నేత

పట్నంబజారు: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌పై రోజురోజుకూ ఆ పార్టీ నేతల్లో అసహనం పెరుగుతోంది. ఇందుకు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ఒంటెత్తు పోకడలే కారణమని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ సీనియర్‌ నేత నంబూరు సుబాని తనయుడు, మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్‌కు జరిగిన తీవ్ర అవమానమే దీనికి సాక్ష్యమని చెబుతున్నారు. మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలను పట్టించుకోకుండా, తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, మైనారిటీల్లో ఎవరూ ఎదగకూడదన్నట్లు నసీర్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పార్టీలకు అతీతంగా మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌కు జరిగిన అవమానంపై ఎమ్మెల్యేను నిలదీస్తున్న ఘటన చర్చనీయాంశమైంది.

పేరు తెలియని నేత వచ్చినా...

ఇటీవల కాలంలో పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్‌ పక్కన మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌ కూడా కూర్చుని ఉన్నారు. అదే సమయంలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, నియోజకవర్గంలో కనీసం పెద్దగా పేరు కూడా లేని వ్యక్తి అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో గౌస్‌ను పక్కకు తొలగాలని ఎమ్మెల్యే నసీర్‌ చెప్పి, అక్కడి నుంచి పంపేశారు. సదరు టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నేతను కూర్చోబెట్టుకోవడంపై ముస్లిం మైనారిటీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవమానాన్ని మైనారిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ఉద్దేశపూర్వకంగానే గౌస్‌ను పక్కకు పంపారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటన సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి సయ్యద్‌ ముజీబ్‌ సైతం గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున సీటు కోసం ప్రయత్నించారు. ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ టికెట్‌ విషయంలో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి. ఈ క్రమంలో నసీర్‌కు టికెట్‌ రావడం, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం వారి కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు లేకపోలేదు. ముజీబ్‌ సోదరుల్లో ఒకరిపై రౌడీషీట్‌ ఉన్న క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే నసీర్‌ పీడీ యాక్ట్‌ పెట్టించారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ముజీబ్‌ సోదరుల్లో ఒకరైన ఫైరోజ్‌ కార్పొరేటర్‌ సీటు ఆశిస్తే, కనీసం ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదు. వారికి సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని టీడీపీ వర్గ నాయకులే చెబుతున్నారు.

నియోజకవర్గంలోని మాయాబజారులో ఉండే మరో ముఖ్య నేత కూడా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఇందుకు ఎమ్మెల్యే నసీర్‌ పూర్తిస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరించడం, ఎన్నికల సమయంలో వారిని వాడుకుని వదిలేయడం కారణమని ఆ నేత వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన పూర్తిస్థాయిలో అన్నింటికీ దూరంగా ఉంటూ మౌనం దాల్చారని చెబుతున్నారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనారిటీలకు ప్రాధాన్యత లేకుండా ఎమ్మెల్యే నసీర్‌ వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. దీనికి తగ్గట్టుగా ఆ పార్టీలో ఉన్న ముస్లిం నేతలను సైతం కార్పొరేషన్‌ ఎన్నికల పేరుతో సస్పెండ్‌ చేయించడం, షోకాజ్‌ నోటీసులు ఇప్పించడంపై ఎమ్మెల్యేపై మైనారిటీలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ రాజకీయ గ్రాఫ్‌పై ప్రభావం చూపుతున్నాయనే చర్చ గుంటూరు రాజకీయాల్లో జోరందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement