బీరు బాటిల్‌తో దాడి చేసి దారుణం రూ.10 వేలు అడిగితే హతమార్చిన వైనం వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు వివరాలు వెల్లడి
లక్ష్మీపురం: హత్య కేసులో నలుగురు నిందితులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐ గంగా వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. పలకలూరు రోడ్డులోని స్వగృహ హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న దొడ్డ నాగరాజు (30) అదృశ్యమైనట్లు అక్టోబర్ 20వ తేదీన తండ్రి దొడ్డ నతానియేల్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అక్టోబర్ 22న ఇన్నర్ రింగ్ రోడ్, ఫేజ్–3, విజ్ఞాన్ కళాశాల వెనుక, పలకలూరు రోడ్డులో దొడ్డ నాగరాజు మృతదేహం లభించింది. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా కేసు సెక్షన్‌ను మార్చి పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో మృతుడికి సంబంధించిన ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ లభించలేదు. దీంతో గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, పర్యవేక్షణలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బంది సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో వెంగళాయపాలెంలోని టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న నడ్డి దుర్గా యశ్వంత్, స్థంభాలగరువుకు చెందిన రెడ్డి మల్లు అలియాస్ మనోజ్, అడవితక్కెళ్లపాడు టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న నంబూరు అశోక్, బొంగరాలబీడు 4వ లైనుకు చెందిన దాసరి సుభాష్ పోలీసులకు పట్టుబడతామనే భయంతో ఈనెల 20వ తేదీన సాయంత్రం వార్డు రెవెన్యూ సెక్రటరీ వద్ద లొంగిపోయారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ వాంగ్మూలాలను నమోదు చేసి, వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ హాజరు పరిచారు.
వార్డు రెవెన్యూ సెక్రటరీ ఇచ్చిన నివేదిక, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా, ఇప్పటి వరకు సెక్షన్ 194 కింద ఉన్న కేసును సెక్షన్లు బదిలీ చేస్తూ హత్య కేసుగా మార్చారు. పోలీసుల విచారణలో మృతుడు దొడ్డ నాగరాజుకు నడ్డి దుర్గా యశ్వంత్ గతంలో రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బుల విషయమై వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో అక్టోబర్ 20న మద్యం తాగడానికి నడ్డి మల్లు అలియాస్ మనోజ్, నంబూరు అశోక్, దాసరి సుభాష్, దొడ్డ నాగరాజు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద కలుసుకున్నారు. అనంతరం వారు స్వర్ణభారతి నగర్‌కు వెళ్లగా, అక్కడ నాగరాజు తనకు రావాల్సిన డబ్బుల గురించి యశ్వంత్‌ను ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో యశ్వంత్ సూచన మేరకు మిగిలిన ముగ్గురు నిందితులు నాగరాజును ఇన్నర్ రింగ్ రోడ్, ఫేజ్–3 ప్రాంతానికి తీసుకువెళ్లి బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరిచగా నాగరాజు చనిపోయినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులను శుక్రవారం రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేసి, వీరి వద్ద మృతుడు నాగరాజుకు చెందిన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌లతో పాటు నిందితులకు చెందిన రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీరు బాటిళ్లతో దాడి చేసి హతమార్చిన నలుగురిని జిల్లా కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రతిభను కనబర్చిన స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, కానిస్టేబుల్‌లు మణీ, సైదాలను అభినందించారు.


