ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 151 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 151 కేసులు పరిష్కారం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 151 కేసులు పరిష్కారం గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం ఎయిమ్స్‌లో నవ జాత శిశువులకు ప్రత్యేక క్లినిక్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన స్టేట్‌ అబ్జర్వర్‌

గుంటూరు లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ బి.సాయి కల్యాణ చక్రవర్తి ఆదేశాల మేరకు శనివారం స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా చెక్‌ బౌన్స్‌ కేసులలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 151 కేసులను పరిష్కరించారు. మొత్తం రూ. 4,56,56,132 కుగాను రూ.3,25,09,403 పరిష్కరించారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో కార్త్తిక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. తొలిరోజు శనివారం భక్తులు నెయ్యి దీపాలు సమర్పించారని, స్వామివారికి పల్లకీసేవ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయని చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారి ప్రత్యేక దర్శనం, దామోదర అష్టకం పఠనం, ఆకాశ దీపోత్సవం, భక్తులచే నెయ్యి దీపం సమర్పించడం, మధురమైన కీర్తనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి లక్ష దీపోత్సవంలో పాల్గొనాలన్నారు. తద్వారా స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

మంగళగిరి రూరల్‌: మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఈ నెల 15 నుంచి నిర్వహించిన జాతీయ నవజాత శిశు వారోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా వరల్డ్‌ ప్రీ మెచ్యూరిటీ డే సందర్భంగా నెలల నిండకముందే జన్మించిన శిశువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిప్‌మర్‌ రిటైర్డ్‌ నియోనేటాలజిస్ట్‌ డాక్టర్‌ బి.విష్ణుభట్‌ మాట్లాడుతూ దేశంలో ఏటా సుమారు 35 లక్షల మంది అకాల శిశువులు జన్మిస్తున్నారని చెప్పారు. అంటే ప్రతి ఏడు, ఎనిమిది జననాలలో ఒకటి ప్రీ మెచ్యూర్‌ డెలివరీ ఉంటోందని వివరించారు. ఆధునిక వైద్య విధానాలతో వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయవచ్చని తెలిపారు. అనంతరం ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహంతెం శాంతాసింగ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన హైరిస్క్‌ ఫాలో–అప్‌ క్లినిక్‌, డిజిటల్‌ పేరెంట్‌ సపోర్ట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా క్విజ్‌, పోస్టర్‌ మేకింగ్‌ పోటీలు, నవజాత శిశువుల అత్యవసర చికిత్సపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ దేశు రామమోహన్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ మోహన్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ దేవకివాడ గోవిందరావు, పీడియాట్రిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ అరుణబాబు, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వేమూరు: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను స్టేట్‌ అబ్జర్వర్‌ పద్మావతి శనివారం పరిశీలించారు. కొల్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని పద్మావతి పరిశీలించారు. మౌలిక సదుపాలయాలపై ఆరా తీశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో ఆమె మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో తగిన వసతులు ఏర్పాటు చేసి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కొల్లూరు తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఎంపీడీవో స్పందన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement