నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదని బుర్రిపాలెంలో దళితుడిపై హత్యాయత్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నీలాంబరం గ్రామంలో దళిత సంఘాల ఆందోళన... అడ్డుకున్న పోలీసులు విచారించి న్యాయం చేస్తామని మండల తహసీల్దార్ హామీ కేసు నమోదు చేయని తెనాలి రూరల్ పోలీసులు పెమ్మసాని ప్రధాన అనుచరుడే దాడి చేశాడని బాధితుడు, కుటుంబసభ్యుల ఆరోపణ
తెనాలి: ‘స్థానిక’ ఎన్నికల్లో అరాచకాలకు, ప్రత్యర్థి పార్టీలపై దాడులు, దౌర్జన్యాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారు. ఇదే కోవలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలమైన బుర్రిపాలెంలో ఆయన అనుచరులు మరింత బరితెగించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని మంత్రి అనుచరులు, టీడీపీకే చెందిన అభ్యర్థి భర్తను అంతు చూస్తామంటూ బెదిరించారు. అయినా వెరవని అతడిపై చీకటిమాటున దాడి చేశారు. గొంతు చుట్టూ తాడు వేసి లాగుతూ హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర పెనుగులాట అనంతరం తప్పించుకున్న బాధితుడిని తెనాలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. స్పృహలోకి వచ్చాక బాధితుడు తానే బైక్ స్కిడ్ అయి పడిపోయానని చెప్పినట్టుగా పోలీసులు నమోదు చేశారు. బాధితుడు నీలాంబరం, ఆయన సోదరుడు సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెం సర్పంచ్ పదవి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వ్ అయింది. దీంతో ఎప్పటినుంచో టీడీపీలో కొనసాగుతున్న నల్లపు నీలాంబరం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ నెల 19న తన భార్య స్వరూప రాణి, తల్లి కుమారి చేత రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. అదే రోజు పోలీసుల సమక్షంలోనే మంత్రి పెమ్మసాని సోదరుడు రంగస్వామి.. అంతుచూస్తానంటూ నీలాంబరాన్ని బెదిరించాడు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలంటూ రంగస్వామి, కిలారి రాజేష్, అడుసుమల్లి వంశీకృష్ణ, శాఖమూరి వినోద్ తమపై ఒత్తిడి చేశారని సాగర్ తెలిపారు. నీలాంబరంపై దాడిని నిరసిస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా బుర్రిపాలెంలో దళిత సంఘాలు భగ్గుమన్నారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పెమ్మసాని సోదరుడు రంగస్వామితో పాటు దాడి చేసిన వారందరినీ అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆందోళనకారులతో మాట్లాడారు. పోలీసులతో పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం చేస్తామని, దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేతలు స్పష్టం చేశారు.
పేరు చెప్పవద్దని ఒత్తిడి
నీలాంబరం శనివారం సాయంత్రం స్పృహలోకి వచ్చారు. పోలీసులు అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. టీడీపీ నాయకుడు కేసన కోటేశ్వరరావు అక్కడికి వచ్చి, పార్టీ పేరు, దాడి చేసినవారి పేర్లు చెప్పొద్దని పోలీసుల ముందే ఒత్తిడి చేసినట్టు సమాచారం. తనపై దాడి చేసినవారిలో ప్రధానంగా కిలారి రాజేష్ ఉన్నాడని బాధితుడు స్పష్టంగా చెబుతున్నా... పోలీసులు మాత్రం కాదంటున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రూరల్ సీఐ నాయబ్ రసూల్‌ను వివరణ కోరగా, ‘తనను ఎవరూ కొట్టలేదని, బైక్ స్కిడ్ అయి పడిపోయానని’ నీలాంబరం స్టేట్‌మెంట్ ఇచ్చినందున ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. బైక్‌పై స్కిడ్ అయి పడిపోతే, తాడుతో బిగించినట్టుగా మెడ భాగం ఎలా ఒత్తుకు పోతుందని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.


