పేరుకే విధులకు హాజరు
గుంటూరు జీజీహెచ్‌లో విధులకు సూపర్ స్పెషాలిటీ వైద్యులు డుమ్మా
వైద్యుల సొంత ప్రాక్టీసుతో
అంతిమంగా పేద రోగులకు
తీవ్ర ఇబ్బందులు
సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులు వైద్యులు అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.వేల నుంచి రూ.లక్షల వరకు ఖర్చయ్యే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పొందేందుకు గుంటూరు జీజీహెచ్‌కు సుమారు ఏడు జిల్లాలకు చెందిన పేద రోగులు రోజూ మూడు వేల మంది వరకు వస్తున్నారు. వారంలో కేవలం రెండు లేదా మూడు రోజులు మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఓపీ విభాగాలు పనిచేస్తున్నాయి. ఆ రెండు రోజుల్లోనూ నిర్ణీత పనివేళలను పాటించకుండా సొంత ప్రాక్టీసులు, సొంత ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పేద, మధ్యతరగతి రోగులు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
ఇక్కడి రోగులను కూడా సొంత ఆసుపత్రులకు తరలిస్తున్న కొందరు డాక్టర్లు
బాధ్యులపై ఉన్నతాధికారుల చర్యలు శూన్యం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓపీ విభాగాల్లో సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలు ప్రతిరోజూ అందుబాటులో ఉండటం లేదు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఓపీ విభాగాల్లో సూపర్ స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఈ వైద్య సేవలు పొందేందుకు వచ్చే పేద, మధ్యతరగతి రోగులు ఓపీ చీటీ తీసుకోవడానికి గంటకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఓపీ చీటీ తీసుకున్న తర్వాత వైద్యుడిని కలిసి పరీక్ష చేయించుకోవడానికి మరో గంట సమయం పడుతోంది. రెండు గంటల తర్వాత వైద్యుడిని కలిసినా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలు చేయించుకోవాలని చీటీపై రాసి పంపిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి వచ్చిన రోగులకు మధ్యాహ్నం 12 గంటలకు లేదా ఒంటిగంట కల్లా పరీక్షలు నిర్వహించి సూపర్ స్పెషలిస్టు వైద్యులు ఓపీలను ముగించి ప్రైవేటు ప్రాక్టీసులకు పరుగులు తీస్తున్నారు. ఆయా పరీక్షల రిపోర్టులు పరీక్షలు చేసిన రోజే ఇవ్వడం లేదు. కొన్ని రక్త పరీక్షల రిపోర్టులను సాయంత్రం ఇస్తుండగా, మరికొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రెండు రోజుల సమయం పడుతోంది. రిపోర్టులు తీసుకున్న తర్వాత మళ్లీ సూపర్ స్పెషలిస్టు వైద్యులను కలవడానికి వారానికి పైగా సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈలోగా వ్యాధి తీవ్రత పెరిగితే రోగులు ఆ బాధలను భరించడమో, అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడమో చేస్తున్నారు.
తనిఖీలు శూన్యం
జీజీహెచ్‌లో ఓపీ పనివేళల్లో సూపర్ స్పెషలిస్టులు విధుల్లో ఉన్నారా? లేదా? అని తనిఖీలు చేయాల్సిన అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ సూపర్ స్పెషలిస్టులు యథేచ్ఛగా బయటకు వెళ్లి సొంత ప్రాక్టీసులు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం పేద రోగులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో చేరుతున్న వైద్య విద్యార్థులు సైతం సీనియర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు పనివేళలు పాటించకపోవడం వల్ల క్లినికల్, అకడమిక్ అంశాల్లో నష్టపోతున్నారు. ఏడు జిల్లాల ప్రజలకు కీలకమైన రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యుల హాజరుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. జీజీహెచ్ అధికారులతో పాటు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కూడా వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా ఆస్పత్రిలో తనిఖీలు చేయాల్సి ఉంది. పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
జీజీహెచ్‌లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆస్పత్రిలో ఉండి పేద రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఉదయం ఓపీ వేళలు ముగిసిన తర్వాత గంటసేపు భోజన విరామం తీసుకుని, అనంతరం వార్డుల్లో అందుబాటులో ఉండాలి. బెడ్‌సైడ్ టీచింగ్ చేస్తూ సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలి. చాలా మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఆస్పత్రిలో నిర్దేశించిన పనివేళలను పాటించడం లేదు. ఉదయం మూడు గంటల పాటు ఓపీల్లో ఉండి, అక్కడి నుంచి నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పలువురు వైద్య విభాగాధిపతులు, వైద్యులు సైతం సొంత ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తూ జీజీహెచ్‌లో పేద రోగులకు కేటాయించాల్సిన సమయాన్ని ఎక్కువ శాతం సొంత సంపాదనకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


