డ్రగ్స్‌ కట్టడికి మరిన్ని చర్యలు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కట్టడికి మరిన్ని చర్యలు

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

డ్రగ్స్‌ కట్టడికి మరిన్ని చర్యలు

మంగళగిరి టౌన్‌: డ్రగ్స్‌ కట్టడికి ఈగల్‌ చేపడుతున్న చర్యలు మరింత మెరుగుపరచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌ దాస్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘హోల్‌ ఆఫ్‌ నేషన్‌ – హోల్‌ ఆఫ్‌ సొసైటీ’ విధానంతోనే మత్తుపదార్థాల నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని ఏపీ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ – ఈగల్‌ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు. గంజాయి సాగును గుర్తించి అరికట్టేందుకు ఆపరేషన్‌ చైతన్యం కింద డ్రోన్లు, ఉపగ్రహ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 849 డ్రగ్స్‌ వినియోగ హాట్‌స్పాట్‌లను గుర్తించి జియో ట్యాగింగ్‌ చేసినట్లు వివరించారు. సుమారు 50 వేల మంది నేరస్తుల వివరాలను ఏకీకృతం చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థల్లో 40 వేల ఈగల్‌ క్లబ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

సరిహద్దుల్లో సమన్వయంతో నిఘా

డ్రగ్స్‌ ముఠాలు కొత్త నెట్‌వర్క్‌లు, రవాణా మార్గాలు, సింథటిక్‌ మాదకద్రవ్యాల ద్వారా కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో నిరంతర నిఘా అవసరమని జాయింట్‌ సెక్రటరీ సూచించారు. రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య సమాచార మార్పిడిని బలోపేతం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈగల్‌ ఆపరేషన్స్‌ ఎస్పీ మహేశ్వర రాజు ఐపీఎస్‌, అడ్మిన్‌ ఎస్పీ స్వరూపరాణి, టెక్నికల్‌ డీఎస్పీ డ్రగ్స్‌ ప్రసాద్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్టిగేషన్‌ డీఎస్పీ వి. వేణుగోపాల్‌ రెడ్డి, శిక్షణ విభాగం డీఎస్పీ టి. త్రినాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement