గుంటూరు ఎడ్యుకేషన్: అక్రమ కేసులో అరెస్టు అయ్యాక గుంటూరు జైలులో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం గుంటూరు రానున్నట్లు పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూరి వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కూడా రానున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభిమానులు హాజరు కావాలని కోరారు.
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను ఆదివారం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వివేది కుటుంబ సమేతంగా సందర్శించారు. కొండలోని మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ప్రతిమలు, రాతి సామగ్రి, మట్టి కుండలు, 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, మహాస్తూపం, అశ్వమేధశాల, స్నానాల గట్టు, బోది వృక్షం తదితరాలను వారు సందర్శించారు. అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, బుద్దవనాన్ని తిలకించారు.
సత్రశాల (రెంటచింతల): పురాతన శైవక్షేత్రమైన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం చోరీ విషయమై విచారించేందుకు పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జి.ఎ.వి. శ్రీనివాస్ ఈ నెల 16వ తేదీన రానున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానాన్ని సందర్శించి నంది విగ్రహం మారిన విషయంపై దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, ప్రధాన అర్చకులు చిట్టేలా మల్లికార్జుశర్మ, బోర్డు సభ్యులతో చర్చించనున్నట్లు వెల్లడించారు.
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 173 సర్పంచి పదవులకు గాను 237 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1,712 వార్డు మెంబర్ల పదవులకు 689 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి ఫేజ్‌లో బొల్లాపల్లి, ఈపూరు, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ మండలాల్లోని గ్రామాల సర్పంచి, వార్డు మెంబర్లకు ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇది సోమ, మంగళవారాల్లో కూడా కొనసాగనుంది.
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌స్టేషన్లల్లో ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ పక్రియ కొనసాగించారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రజా ప్రశాంతతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు, నేరచరిత్ర ఉన్న వ్యక్తులపై జిల్లా పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
సబ్‌స్టేషన్ పరిశీలన
తాడికొండ: తుఫాన్ నేపధ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తాడికొండ సబ్‌స్టేషన్‌ను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఆదివారం పరిశీలించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురసు సమయంలో సబ్‌స్టేషన్‌లోకి వరద చేరడంతో ఈ సారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


