గుంటూరు వెస్ట్: రానున్న తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులకు సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ, ‘టీం గుంటూరు’గా సమష్టిగా పనిచేసి తుఫానును సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. నవంబరు 18వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 19వ తేదీన దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 20వ తేదీన కూడా వర్షాలు కురుస్తాయని ఆర్‌టీజీఎస్ సూచనలు జారీ చేసిందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.


