సీట్ల పేరిట తమ్ముళ్ల కక్కుర్తి | - | Sakshi
Sakshi News home page

సీట్ల పేరిట తమ్ముళ్ల కక్కుర్తి

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

ఎన్నికల్లో కార్పొరేటర్‌ టికెట్‌ ఇప్పిస్తామని నగదు వసూళ్లు గుంటూరు తూర్పు ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుల నిర్వాకం సీట్లు రాకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి అడుగుతున్న నేతలు

పట్నంబజారు: గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో సందడిలో సడేమియా... తెలుగుతమ్ముళ్లు అమ్యామ్యాలు లాగించేశారు. దొరికిందే సందు అన్నట్లు కార్పొరేటర్‌ సీట్లు ఆశించిన వారి నుంచి సీట్లు ఇప్పించే బాధ్యత తమదేనంటూ గుంటూరు తూర్పులో కూటమి ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు వసూళ్ల పర్వానికి తెరలేపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్‌ సీట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారి నుంచి కొందరు నాయకులు, ప్రజాప్రతినిధికి సన్నిహితులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గుంటూరు ఈస్ట్‌ 17వ డివిజన్‌కు సంబంధించి ఒక టీడీపీ స్థానిక నేత, ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉండే బంగారు వ్యాపారుల సంఘం నాయకుడికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీటు ఇప్పించలేకపోవడంతో తిరిగి ఆ డబ్బులు అడిగిన పరిస్థితుల్లో వివాదం నేరుగా ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. ఇటువంటి ఘటనలు పలు డివిజన్లకు సంబంధించి కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు పలువురి వద్ద ఈ విధంగా వసూళ్లు చేసిన క్రమంలో, తిరిగి ఆ డబ్బులు ఇప్పించలేక, డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు సమాధానం చెప్పలేని పరిస్థితులు ప్రజాప్రతినిధికి తలనొప్పిగా మారిందని సమాచారం. మరెక్కడైనా ఇలానే డబ్బులు వసూలు చేశారా? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్‌గా పోటీ చేయాలనే ఆశతో పలువురు ఎదురుచూస్తున్న వేళ కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటు ఇప్పిస్తామని, ముఖ్య నాయకులతో మాట్లాడి టికెట్‌ ఖరారు చేయిస్తామని నమ్మబలికి నగదు వసూలు చేశారని సమాచారం.

‘డిపాజిట్లు’ గల్లంతు?

కేవలం ఇది ఒక డివిజన్‌లో జరిగిన అంశం మాత్రమే కాదని స్పష్టంగా తెలుస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరికొందరు ఆశావహుల నుంచి నేరుగా సదరు ప్రజాప్రతినిధి తీసుకున్న నగదు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బులు పంపిణీ చేయాల్సి ఉందని పలువురు ఆశావహుల నుంచి ముందుగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రజాప్రతినిధి తీసుకున్నట్లు కొంతమంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ మొత్తం ఆయా ఓటర్లకు ఇవ్వలేదని తెలిసింది. ఆ మొత్తాన్ని అభ్యర్థులకు కూడా వెనక్కి ఇవ్వలేదని సమాచారం. టికెట్‌ కోసం పార్టీ పెద్దల చుట్టూ తిరిగిన వారు చివరకు ఆర్థికంగా నష్టపోయామని వాపోతున్నట్లు తెలిసింది.

పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు?

ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు నిజమైతే వాటిపై ప్రజాప్రతినిధి స్పందించాల్సిన అవసరం ఉంది. తన పేరు చెప్పుకొని ఎవరైనా అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారా? అలాంటి వారికి తనతో ఉన్న సంబంధాలేమిటి? బాధితులకు న్యాయం చేసే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ పదవుల ఆశ చూపి అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నగదు వసూలు చేశారనే ఆరోపణలు ప్రజాస్వామ్య రాజకీయాలకే మచ్చగా మారాయి. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్పందించి అంతర్గత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలే కోరడం కొసమెరుపు. ఆఖరికి బాధితులకు న్యాయం జరుగుతుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement