ప్రత్యేకత చాటుతున్న రాయన గిరిధరగౌడ్ చిత్రాలు 14 నుంచి ఢిల్లీలో కనువిందు చేయనున్న ప్రదర్శన
తెనాలి: తెనాలికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధరగౌడ్ తాజా చిత్రాలు దేశ రాజధాని ఢిల్లీలో కళాప్రియులను ముగ్ధులను చేయనున్నాయి. ఆరుగురు చిత్రకళాకారులతో కలిసి అక్కడి బికనీర్ హౌస్‌లోని సెంట్రల్ హాలులో ఈ బృంద ప్రదర్శన ఏర్పాటు కానుంది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో గిరిధర్‌గౌడ్‌వి ఐదు పెయింటింగ్స్, పది రేఖాచిత్రాలు కొలువుదీరనున్నాయి. లేపాక్షి చిత్రకళలోని సంప్రదాయ ప్రతిధ్వనులను దాటి, ఆధునికతను జోడించి శివ–శక్తిల శాశ్వత తత్వాన్ని దృశ్యీకరించిన చిత్రసరళి ఇది.
విభిన్న శైలులు...
మైసూర్‌లో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ, బరోడాలో పీజీ చేసిన గిరిధరగౌడ్ అక్కడే కొంతకాలం ఫ్యాకల్టీగా పనిచేశారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా అనిపించక తెనాలి సమీపంలోని స్వస్థలం గరువుపాలెంలో స్థిరపడ్డారు. అక్కడే చిత్రకళా రచనలో ప్రయోగాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో తొలిదశలో పౌరాణిక చిత్రాలను గీస్తూ వచ్చారు. ఒకే మూసకు పరిమితం కాకుండా తన కళాజీవితంలో మహాభారతం, రామాయణం ఇతివృత్తాలను, విభిన్న శైలులను అనుసరించి ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రకళా సిరీస్‌ను రూపొందిస్తున్నారు. వర్ణాల వినియోగంలో విలక్షణత గిరిధరగౌడ్‌లోని ప్రత్యేకతగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు.
‘లేపాక్షి’కి నవ్యధోరణి...
కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్‌తో లేపాక్షి చిత్రకళపై చేసిన పరిశోధన అనంతరం చిత్రకళా రీతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు శతాబ్దాల నాటి లేపాక్షి కళలోని మంచి లక్షణాలను, శైలిని దృష్టిలో ఉంచుకొని నవ్యధోరణితో, రంగుల మేళవింపుతో ఆధునికతను మేళవిస్తున్నారు. చిత్రకళా రచనలో ‘దశావతారాలు’ నుంచి రకరకాల సిరీస్‌లను తీసుకొచ్చారు. ఆ క్రమంలో చిత్రీకరించిన కళాఖండాలను ‘శివ శక్తి’ సిరీస్‌గా గతేడాది హైదరాబాద్ కళాకృతిలో ప్రదర్శించారు. తాజాగా ఢిల్లీలో బృంద ప్రదర్శనకు చేసిన చిత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందూ చింతనలోని అత్యంత లోతైన తాత్విక భావనలలో ఒకటైన శివ–శక్తి శాశ్వత తత్వాన్ని అన్వేషించేవిగా ఉన్నాయి.
చైతన్య తత్వాన్ని వివరించేలా...
శివ–శక్తికి సంబంధించిన విడదీయరాని బంధాన్ని శ్రీచక్రం, ప్రకృతి–పురుష తత్వం ద్వారా దృశ్యకళారీతిలో ప్రయోగాత్మకంగా చేసిన చిత్రసరళిగా గిరిధరగౌడ్ చెప్పారు. శివుడు, శివ శక్తి, నంది, సింహనంది, మయూర, గణపతి, కుమారస్వామి, మూషికం... కుటుంబం అంతా మమేకమై సృష్టికి సంబంధించిన చైతన్యతత్వాన్ని వివరించే దృశ్య రూపాలివి. వీటిలో సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ రూపాలను ఈ చిత్రసరళిలో శ్రీచక్ర రూపంలో ఇమిడి ఉండేలా చిత్రీకరించారు. శ్రీచక్రం స్వరూపాన్ని కేవలం దృశ్యమాధ్యమంలా కాకుండా, శివ–శక్తి త్రికోణాత్మక తత్వాలను జోడించారు. ఆదిశంకరాచార్య ‘సౌందర్యలహరి’లోని శ్లోకాలను స్ఫూర్తిగా తీసుకుని, అర్ధనారీశ్వర స్తోత్రానికి ఆలంబనగా శివకుటుంబం మహత్యాన్ని దృశ్యమాధ్యమంలో తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. అక్రిలిక్ పెయింటింగ్స్‌కు బంగారం, వెండి పూతను అద్దటం మరో విశిష్టత.
దేశవిదేశాల్లో చిత్రాలు...
గత మూడు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లోని గ్యాలరీల్లో 10 సోలో ఎగ్జిబిషన్లు చేశారు గిరిధరగౌడ్. దేశవ్యాప్తంగా జరిగిన 37 గ్రూప్ ఎగ్జిబిషన్లలోనూ చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో లండన్, న్యూయార్క్, సింగపూర్, చైనా తదితర ఎగ్జిబిషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతోపాటు అనేక కళాసంస్థల నుంచి గౌరవాన్ని అందుకున్నారు.


