గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ మార్గదర్శకత్వంలో, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి నాయకత్వంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 46 బెంచ్‌లను, జిల్లా కోర్ట్‌లో 16 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 14,587 కేసులను పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 954, క్రిమినల్ కేసులు 13594, ప్రీ– లిటిగేషన్ కేసులు 39 ఉన్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అధిక విలువ కలిగిన అనేక కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించబడ్డాయని తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలో సివిల్ కేసుల పరిష్కారంలో వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 24 భూ సేకరణ అప్పీళ్లకు లోక్‌అదాలత్‌లో పరిష్కారం లభించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవరపల్లి జయంత్ కుటుంబసభ్యులకు రూ.96 లక్షల పరిహారం చెల్లించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీ అంగీకరించింది. సోదరీమణులు తమ ఆస్తి హక్కును వదులుకుని రూ.రెండు కోట్లు స్వీకరించేందుకు అంగీకరించారు.


