అమరావతి: 2026–2027 ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన అదనపు కోర్టు ఏర్పాటు నిమిత్తం సోమవారం స్థానిక జెడ్పీ అతిథి గృహం శాంతిథామం భవనాన్ని పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి భవనాన్ని పరిశీలించి కోర్టు ఏర్పాటుకు భవనంలో చేయాల్సిన పలు మార్పులను అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్‌రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతిలతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: ఆగష్టు 13వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయా ప్రాంతాలను అమరావతి అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లను ఏడీసీ చీఫ్ ఇంజినీర్ మోజెస్ కుమార్ ఉన్నతాధికారులకు వివరించారు. బకింగ్‌హామ్ కెనాల్ వద్ద బ్యూటిఫికేషన్, సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, కొండవీటి వాగు, గుంటూరు చానల్ వద్ద జరుగుతున్న తుది నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, మంగళగిరి స్టేషన ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తాడికొండ ఆర్ అండ్ బీ డీఈఈ లక్ష్మీనారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.
తెనాలిరూరల్: తెనాలి రైల్వేస్టేషన్‌ను దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజనీకుమార్ సిన్హా సోమవారం సందర్శించారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి అప్పికట్ల వరకు ఆర్పీఎఫ్ పరిధిలో చేపడుతున్న రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును ఐజీ పరిశీలించారు. ఇటీవల పలు కీలక చోరీ కేసులను ఛేదించడంలో తెనాలి ఆర్పీఎఫ్ సిబ్బంది చూపిన ప్రతిభను ఆయన అభినందించారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రైల్వే పరిధిలో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయనున్నట్లు ఎస్పీ షణ్ముక్ వడివేలు తెలిపారు.
అమరావతి: అమరావతి పోలీస్ స్టేషన్‌ను ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సోమవారం సాయంత్రం సందర్శించారు. ఆయన స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. పలు రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతోపాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సిబ్బందికి ఐజీ సూచించారు. తొలుత ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠికి సీఐ అచ్చియ్య ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


