సాక్షి, నరసరావుపేట: నవులూరి చెన్నారెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు పల్నాడు జిల్లా అడిషన్ ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరిని కోరారు. ఈమేరకు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సమన్వయకర్తలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు, డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తదితరులు సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి హత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. హత్యకు పాల్పడిన అసలు నిందితులను త్వరితగతిన గుర్తించి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యెల్లో మీడియా, పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలను, ఆధారం చేసుకొని పార్టీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
అడిషనల్ ఎస్పీకి
వైఎస్సార్ సీపీ నేతల వినతి
రెంటాల హత్య కేసులో దోషులు
ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
హాజరైన సమన్వయకర్తలు పిన్నెల్లి,
కాసు, గోపిరెడ్డి, బొల్లా, గజ్జల


