లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు సెప్టెంబర్‌ ఒకటిన సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ ఇండియా– తైవాన్‌ ఒప్పందంతో కొత్త అధ్యాయం

తాడేపల్లి రూరల్‌: ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో 2025, ఏప్రిల్‌, 16వ తేదీన రాత్రి సమయంలో కనకపూరి లంకబాబు తన బావమరిది కుమార్తెలు ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడంతో అతడిపై బాలికల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన అప్పటి ఎస్‌ఐ ఖాజావలి గుంటూరు పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి షమీమ్‌ పర్వీన్‌ సుల్తానా బేగం ముద్దాయి కనకపూరి లంకబాబుకు జైలు శిక్ష, జరిమానా విధించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: సెప్టెంబర్‌ ఒకటో తేదీన పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఛలో గుంటూరు నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుమలరెడ్డి, దయానంద్‌ కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల ర్యాలీ, ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పునరుద్దరణ హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన దాదాపు ఐదువేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితం ఎంతో దుర్భరంగా మారిందని, వారికి సీపీఎస్‌ పెన్షన్‌ రూపంలో నెలకు రూ.వెయ్యి, 1,200 చొప్పున వస్తోందన్నారు. ఇది సామాజిక పెన్షన్‌ కంటే తక్కువగా ఉందన్నారు. సెప్టెంబర్‌ ఒకటిన గుంటూరులో తలపెట్టిన సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు.

విజ్ఞాన్‌ను సందర్శించిన తైవాన్‌ ఏషియా వర్సిటీ ప్రతినిధి బృందం

చేబ్రోలు: ఇండియా– తైవాన్‌ విద్యా సహకారానికి మరింత బలం చేకూర్చే దిశగా తైవాన్‌కు చెందిన ఏషియా యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం విజ్ఞాన్‌ యూనివర్సిటీను సందర్శించింది. ఈ పర్యటన ఇండియా– తైవాన్‌ అకడమిక్‌ కోలాబరేషన్‌ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. తైవాన్‌ ప్రతినిధి బృందంలో ప్రొఫెసర్‌ లిన్‌ చున్‌–వెయ్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ చార్లెస్‌ సి.ఎన్‌.వాంగ్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ చింగ్‌–హ్సియన్‌ హ్సు, మిస్‌ జిల్‌ లై, డాక్టర్‌ యింగ్‌–రాంగ్‌ హో పాల్గొన్నారు. సమావేశంలో ఇరు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు సంయుక్త పరిశోధనలు, సెమీకండక్టర్‌, కృత్రిమ మేధ(ఏఐ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సంయుక్త విద్యా కార్యక్రమాలు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థుల గ్లోబల్‌ మొబిలిటీ, ద్వైపాక్షిక డిగ్రీ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ తైవాన్‌ సాంకేతిక నైపుణ్యాన్ని భారత యువత ప్రతిభతో కలిపితే ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement