శత్రు దేశాల యుద్ధ తంత్రమే దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

శత్రు దేశాల యుద్ధ తంత్రమే దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

ఈగల్‌ విభాగం ఇన్‌చార్జి ఆకే రవికృష్ణ

పెదకాకాని: నిషేధిత మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకోవటమే కాకుండా వారి కుటుంబాలను, యావత్‌ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఈగల్‌ విభాగం రాష్ట్ర ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆకే రవికృష్ణ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ సెమినార్‌ హాలులో ఏపీ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌ అవేర్నెస్‌ టు యాక్షన్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆకే రవికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు వారు తిన్నా తినకపోయినా పిల్లల చదువు కోసం వారి ఆస్తిపాస్తులను అమ్మి వారి భవిష్యత్‌ బంగారంలా ఉండాలని భావిస్తుంటారని చెప్పారు. కానీ తెలిసి తెలియని యవ్వనపు వయస్సులో విద్యార్థులు చెడు స్నేహాల బారిన పడి గంజాయి, హెరాయిన్‌ వంటి సైకో డ్రిక్స్‌, సింథటిక్‌ డ్రగ్స్‌కు అలవాటు పడి ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కఠిన శిక్షలను అనుభవిస్తున్నారని వివరించారు. శత్రు దేశాలు మనపై నేరుగా గెలవలేక అనైతిక విధానాలు ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి దేశ భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ మాజీ అధికారి డాక్టర్‌ గుత్తికొండ కొండలరావు మాట్లాడుతూ డ్రగ్స్‌ కారణంగా పెడదోవ పడుతున్న సమాజానికి కనువిప్పు కలిగేలాగా నేటి యువత మరీ ముఖ్యంగా న్యాయ విద్యార్థులు ఈ సందిగ్ధ వ్యవస్థలో సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభకు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సురేష్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. న్యాయ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌.విజయలక్ష్మి మాట్లాడుతూ యూఎన్‌ఓ నిర్వహించిన సర్వే ప్రకారం12 నుంచి 17 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులో ఎక్కువమంది ఇలాంటి మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారని తెలిపారు. ఈగల్‌ టీం అధికారులు విద్యార్థులతో డ్రగ్స్‌ ఉపయోగించమని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement