● రోగితో మాట్లాడుతూనే వెన్నెముక ఎండోస్కోపీ శస్త్రచికిత్స ● అవేక్ స్పైన్ ఎండోస్కోపీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
గుంటూరు మెడికల్: గుంటూరులోని మల్లిక స్పయిన్ సెంటర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. చైన్నెలో జరిగిన మిస్సాబ్‌కాన్ 2026 సదస్సులో పాన్ ఏషియన్ సొసైటీ ఆఫ్ మినిమల్లీ ఇన్‌వేసివ్ స్పయిన్ సర్జరీ, చైన్నె స్పయిన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మినిమల్లీ ఇన్‌వేసివ్ స్పయిన్ సొసైటీ ఆఫ్ భారత్( మిస్సాబ్) ఇన్నోవేషన్ అవార్డు 2026ను గుంటూరు మల్లిక స్పయిన్ సెంటర్ చీఫ్ స్పయిన్ సర్జన్ డాక్టర్ జె.నరేష్‌బాబు అందుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ బృందం మొత్తం పది శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను సమర్పించింది. వీటిలో నాలుగు పత్రాలు వివిధ అవార్డు విభాగాలకు ఎంపికై అవార్డులు గెలుచుకున్నట్లు తెలిపారు.
పూర్తి మత్తు లేకుండానే వెన్నెముక శస్త్రచికిత్స
వెన్నెముక శస్త్రచికిత్సకు సాధారణంగా అవసరమయ్యే పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేకుండా, సరైన రోగులను ఎంపిక చేసి, తగిన మత్తు విధానాలతో రోగి మెలకువగా ఉండి వైద్యులతో మాట్లాడుతూనే వెన్నెముక ఎండోస్కోపీ శస్త్రచికిత్స నిర్వహించే ‘అవేక్ స్పయిన్ ఎండోస్కోపీ’ అనే వినూత్న విధానాన్ని అభివృద్ధి చేసి, సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన సాంకేతికతలు, మెళకువలను ప్రతిపాదించినందుకు డాక్టర్ నరేష్‌బాబుకు ఈ అవార్డు లభించింది.
ధ్వని తరంగాలతో వెన్ను ఒత్తిడి తొలగింపు
వెన్నెముక శస్త్రచికిత్సలో సంప్రదాయంగా ఉపయోగించే మోటార్ డ్రిల్స్, బోన్ కట్టర్స్, బర్స్ వంటి పరికరాలకు భిన్నంగా, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ (అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు) ఆధారంగా పనిచేసే సాంకేతికతను ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలో ఉపయోగించడం ఈ విధానంలోని ప్రత్యేకత. ధ్వని తరంగాలు వెన్నులోని నరాలకు హాని కలిగించకుండా వెన్ను ఒత్తిడిని నివారించే ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా నరాలు, ఇతర సున్నితమైన నిర్మాణాలకు సమీపంగా పనిచేసే సమయంలో ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుంది.
తొలిసారి ఆపరేషన్‌కు అవార్డు
మొదటిసారిగా ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలో అల్ట్రాసోనిక్ టెక్నాలజీని ఉపయోగించి, కేవలం సుమారు 4 మిల్లీ మీటర్ల. చిన్న కోతల ద్వారా మెడ, వీపు, నడుము వెన్నెముకలకు శస్త్రచికిత్స నిర్వహించే ‘ఎండోస్కోనిక్ సర్జరీ’ విధానాన్ని ప్రతిపాదించి అభివృద్ధి చేసినందుకు ఈ పరిశోధనకు ఇన్నోవేషన్ అవార్డు లభించింది.


