గుంటూరు వెస్ట్: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అన్నివిధాలా అండగా నిలవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు. ఇన్‌చార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతులు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
తక్కువ నీటి వనరులతో
ఎక్కువ ప్రయోజనం పొందేలా..
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రైతులకు వీలైనంత కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరుల లభ్యత, సాగునీటి అవసరాలను సమగ్రంగా పరిశీలించి రైతులకు సాధ్యమైనంత మేరకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటి వనరులతో సమగ్ర ప్రణాళికతో రైతులకు ఎక్కువ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్


