అమరావతి చిత్ర కళా వీధి అట్టర్‌ ఫ్ల్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

అమరావతి చిత్ర కళా వీధి అట్టర్‌ ఫ్ల్లాప్‌

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

తూతూ మంత్రంగా ఏర్పాట్లు

ప్రారంభోత్సవానికి వచ్చిన విద్యార్థుల అవస్థలు

అర్థం చేసుకోవాలని కోరిన కూటమి నాయకులు

నగరంపాలెం: అమరావతి ‘చిత్ర కళా వీధి’ అట్టర్‌ ఫ్ల్లాప్‌ షోగా మిగిలింది. గుంటూరు రింగ్‌రోడ్డు వెంట తలపెట్టిన అమరావతి చిత్ర కళావీధి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఏర్పాట్లు అథమంగా ఉన్నాయి. విద్యార్థులను భారీగా తరలించారు. అసలే ఉక్కపోతతో అల్లాడుతుంటే నడి వీధిలో షామియానాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రసంగాలు చేయడంతో చెమటలుపట్టాయి. సుమారు పదిన్నర నుంచి నాయకుల ప్రసంగాలు మొదలవ్వగా, ఎర్రని ఎండల్లో భరించక తప్పలేదు. వేదికపై ఉన్న నాయకులు ఇబ్బంది పడ్డారు. ఇక వేదిక ముందు కుర్చీలపై ఓ ప్రైవేట్‌ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎర్రని ఎండల్లో ఉండిపోయారు. ఇక డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాట్లాడే సమయంలో ఎండలో కూర్చున్న విద్యార్ధులు అందరూ ఒక్కసారిగా లేచి వేదిక ముందున్న నీడలోకి వచ్చేసి నిలబడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ శంకర్‌విలాస్‌ బ్రిడ్జి పునః నిర్మాణ పనులు జరుగుతున్నాయని తద్వారా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. వచ్చే ఏడాదిలో చిత్రకళా వీధి నిర్వహించాలని నిర్వాహకులకు సూచించినట్లు చెప్పుకొచ్చారు. అయినా నగరంలో ట్రాిఫిక్‌ క్రమబద్ధీకరిస్తామని హామీ మేరకు అనుమతిచ్చామని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైన అర్థం చేసుకుంటారని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ పైన ఎండ తాకిడి ఎక్కువగా ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, వెస్ట్‌, ఈస్ట్‌ ఎమ్మెల్యే గళ్లా మాధవి, నసీర్‌ విద్యార్థుల గురించి ఆరా తీశారు. –

ఆదివారం కూడా ఏర్పాట్లు..

అమరావతి చిత్ర కళా వీధికి కళాకారులు, చిత్రకళాకారులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. కొందరు నిర్వాహకులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం చిత్ర కళా వీధికి చేరారు. చిత్రలేఖన ఫొటోలు, పెయింటింగ్‌లు ఇతరత్రా సామాన్లతో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కూటమి నాయకులు విఫలమయ్యారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఇబ్బందులు తప్పలేదు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కష్టాలు పడ్డారు. ఇప్పటికే శంకర్‌విలాస్‌ రైల్వేఓవర్‌బ్రిడ్జి పునః నిర్మాణ పనుల దృష్ట్యా రింగ్‌ రోడ్డు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంది. ట్రాఫిక్‌ మళ్లించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డీ మార్ట్‌ నుంచి సాయిబాబా రోడ్డు ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రకటన చేయడంతో మరింత ఇబ్బందులకు గురిచేశాయి. శనివారం రింగ్‌రోడ్డు మీదగా వికాస్‌నగర్‌, జేకేసీ కళాశాల రోడ్డు, రాజేంద్రనగర్‌ వైపు వెళ్లేందుకు స్థానికులు, చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. అడ్డరోడ్ల మీదగా వయా రింగ్‌రోడ్డు వైపు వచ్చే ప్రదేశాల్లో బారికేడ్ల ఏర్పాటు చేయగా పోలీసులతో చోదకులకు స్వల్ప వాదనలు చోటుచేసుకున్నాయి. అప్పటికే కొందరు వాహనదారులు తెలియక రింగ్‌ రోడ్డు వైపు రాగా, రహదారి పక్కనే దుకాణాలు ఉండటంతో వెనుదిరిగి వెళ్లారు.

కళ తప్పిన వ్యాపారాలు..

ఇక రింగ్‌రోడ్డు డీ మార్ట్‌ నుంచి సాయిబాబా గుడి వరకు ఇరువైపులా నెలకొన్న పెద్ద రిటైల్‌, హోల్‌సేల్‌ వస్త్ర దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, కల్యాణ మండపంలో నిర్వహించే ఎక్స్‌పో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పలేదు. ఇక సాయంత్రం వేళ రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్ల వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ఆదివారం కూడా నగర వాసులు, చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పవు. కూటమి ప్రభుత్వంపై చోదకులు నిప్పులు చెరిగారు. ఏదైనా పెద్ద ఎత్తున్న స్టాల్స్‌ నిర్వహించేటప్పుడు ఏదైనా ఖాళీ మైదానాలు, శివారు ప్రాంతాలను ఎంచుకుంటారని, నగరానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకై క రింగ్‌రోడ్డును రెండు రోజులు ట్రాఫిక్‌ మళ్లించడం ఎంతవరకు సమంజసమని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement