తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక పోటీలు

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక పోటీలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గుంటూరు విద్యానగర్‌లోని సక్సెస్‌ స్కూలులో జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యాన జిల్లాస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌– 2026 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి కాశీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పోటీలకు దాదాపు 300 మంది పైగా పాల్గొన్నారన్నారు. పోటీలకు అబ్జర్వర్‌గా న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్‌ ట్రెజరర్‌ రసూల్‌, టెక్నికల్‌ సపోర్ట్‌గా స్టేట్‌ అసోసియేషన్‌ ఈసీ మెంబర్‌ అంకమ్మరావు వ్యవహరించారు. వయస్సుల వారీగా జిల్లా జట్లను ఎంపిక చేసి ఈ నెల 21, 22, 23 తేదీలలో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌బాబు, సక్సెస్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సాయి మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, సాయి, రామకృష్ణ, వలి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

కొల్లిపర: మండల పరిధిలోని అన్నవరం గ్రామానికి చెందిన నలుగురికి రోడ్డు ప్రమాదంలో గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం గ్రామానికి చెందిన తాతా శివమ్మ, ఏమినేని గోవిందమ్మ, తాతావెంకటసుబ్బారావు, ఏమినేని అనిత లంక పొలం పనులు ముంగిచుకుని కృష్ణానది కరకట్ట మార్గంలో బైకుపై ఇంటికి వస్తున్నారు. అతివేగంగా కారు వచ్చి బైకులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయాలైన వారిని స్థానికులు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలైన వారిలో శివమ్మ, ఏమినేని గోవిందమ్మలకు తీవ్రగాయాలు అవటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అర్ధరాత్రి పంట పొలం దున్నిన గుర్తు తెలియని వ్యక్తులు

తాడికొండ: అస్తి వివాదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పంటను దున్నిన ఘటన తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తలశిల గోపి, చైతన్య అనే రైతులకు నిడుముక్కల గ్రామంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల పంట భూమి ఉంది. 1990 నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గోపి, చైతన్యల పెద్దమ్మ తలశిల ఇందిర వచ్చి ఆ పొలంపై తనకు హక్కు ఉందని, ఎటువంటి చట్ట పరమైన ఆధారాలు చూపకుండా ఆ పొలంలో సర్వే చేయించి హద్దు రాళ్లు వేశారు. దీంతో బాధితులు ఇందిర తీరుపై కలెక్టర్‌, తహసీల్దార్‌, పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలంలో పాతిన హద్దు రాళ్లను తొలగించాలని కలెక్టర్‌ తహసీల్దార్‌ను ఆదేశించగా పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఇందిర, ప్రణీత్‌కుమార్‌లు కిరాయి పనులు చేసే వారితో పంట చేను దున్నించి, కౌలు రైతును బెదిరించారన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు ఇందిర వలన ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కావాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement