కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 12.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తెనాలి మండలంలో 0.6 మి.మీ. వర్షం పడింది. సగటున 2.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకాని మండలంలో 10.2 మి.మీ., మంగళగిరి 6.8, పెదనందిపాడు 6.2, కొల్లిపర 4.2, ఫిరంగిపురం 2.6, పొన్నూరు 2.6, తాడికొండ 2.2, కాకుమాను 2.2, తాడేపల్లి 1.2, తుళ్ళూరు మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆగస్టు మాసం 8వ తేదీ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 42.5 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 27.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తాడికొండ: రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి నుంచి దొండపాడు వరకు జరుగుతున్న పనులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి శనివారం పరిశీలించారు. మూడు దశల్లో జరుగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభం చేయనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. సీడ్ యాక్సెస్‌రోడ్డుపై ఉండవల్లి వద్ద కొండవీటివాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఏడీసీ చీఫ్ ఇంజినీరు టి.మోజెస్‌కుమార్‌ను ఆదేశించారు. రాయపూడి గ్రామంలో నిర్మించిన సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీరు టి.వైకుంఠరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీధర్‌రెడ్డి, డీఈఈ వై.అప్పాజి, ఎన్‌సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


