సాక్షి, ప్రతినిధి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి పేరుతో గుంటూరు నగరంలోని రింగ్‌రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డు వద్ద నుంచి కిలోమీటరు మేర రోడ్డు మొత్తాన్ని దిగ్బంధం చేశారు. క్రీడా ప్రాంగణాల్లో పెట్టుకోవాల్సిన కార్యక్రమాన్ని పబ్లిసిటీ కోసం నడిరోడ్డుపై పెట్టి రెండు రోజులపాటు ట్రాఫిక్‌కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలిగించారు. అసలే అరండల్‌పేట ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పేరుతో ఉన్న బ్రిడ్జి కూల్చి వేసి ఏడాది దాటుతుండటంతో నగర ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పట్టాభిపురం రోడ్డు, లక్ష్మీపురం రోడ్డు, రింగ్‌రోడ్డు వంటి మూడు ప్రధాన రహదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమవుతుంటే వారి కష్టాలు తీర్చాల్సిన అధికారులే రోడ్లను బ్లాక్ చేసి పబ్లిసిటీ కోసం ఈవెంట్లు నిర్వహించడంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు రెండు రోజులపాటు జరిగే ఈవెంట్‌కు రూ.కోట్లలో ఖర్చు చేయడంతోపాటు, నగర ప్రజలను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.


