ప్రధాని మోదీని కలసిన భాష్యం రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని కలసిన భాష్యం రామకృష్ణ

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

ప్రధాని మోదీని కలసిన భాష్యం రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై పోలీస్‌ కస్టడీ పిటిషన్‌ జాతీయస్థాయిలో కానిస్టేబుల్‌కు రజత పతకం ఆవిష్కరణల ద్వారా భావి ఇంజినీర్లుగా ఎదుగదల మెడికల్‌ కళాశాల వరకు బస్సులు ఏర్పాటు చేయండి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగా ఇచ్చిన అల్పాహార విందులో భాగంగా నూతనంగా ఎన్నికై న రాజ్యసభ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈసందర్భంగా భాష్యం రామకృష్ణ ప్రధాని మోదీతో సంభాషించారు.

చిలకలపూడి (మచిలీపట్నం): గుంటూరు ఈస్ట్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫాను ఐదు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించాలని శుక్రవారం కృష్ణా జిల్లా బందరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కిడ్నాప్‌, దోపిడీ, హత్యాయత్నం కింద నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా, బుధవారం ఆయనను గుజరాత్‌లో అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.

నగరంపాలెం: భవిష్యత్‌లో మరెన్నో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో విజయాలు సాధించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి జీఎంసీ బయో ఇండోర్‌ స్టేడియంలో గతనెల 23– 30 వరకు 11వ ఆల్‌ ఇండియా పోలీస్‌ జూడో క్లస్టర్‌–2026 పోటీలు జరగ్గా, పెన్‌కక్‌ సిలట్‌ 110 కేజీల విభాగంలో చేబ్రోలు పీఎస్‌ కానిస్టేబుల్‌ పోతురాజు రజత పతకం (ద్వితీయ స్థానం) సాధించి ప్రతిభను చాటారు. ఈ మేరకు అతన్ని శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించి, సర్టిఫికెట్‌, మెడల్‌తో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్‌ శాఖకు గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు.

ఐఈఈఈ గుంటూరు సబ్‌ సెక్షన్‌

చైర్‌ డాక్టర్‌ ఎన్‌ ఉషారాణి

చలపతి యూనివర్సిటీలో ఘనంగా

ఐ ఈఈఈ– ఉద్గమా 2026 సదస్సు

తాడికొండ: ఆవిష్కరణ, నాయకత్వం ద్వారా భావి ఇంజినీర్లుగా ఎదగవచ్చని ఐఈఈఈ హైదరాబాద్‌ సెక్షన్‌ కార్యదర్శి, సిలికాన్‌ ల్యాబ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఎన్‌ వెంకటేష్‌ అన్నారు. చలపతి యూనివర్సిటీలో ఐ ఈఈఈ హైదరాబాద్‌ సెక్షన్‌ స్టూడెంంట్‌ యాక్టివిటీస్‌ కమిటీ, ఐఈఈఈ గుంటూరు సబ్‌ సెక్షన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్గామా 2026 సదస్సు నిర్వహించారు. ఎఫ్ట్రానిక్స్‌ కంపెనీ ఎండీ డి రామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్‌ వ్యవస్థలు– వ్యవస్థల సమాహారం అనే అంశంపై వివరించారు. కార్యక్రమంలో ఎడ్జి ఇంటెలిజెన్స్‌ పరిష్కారాలు–విద్యార్థుల ఆవిష్కరణలు విజయవంతమైన ఉత్పత్తులుగా మలచడంపై వివరించారు. ఐఈఈఈ గుంటూరు సబ్‌ సెక్షన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎన్‌ ఉషారాణిలు అంశాలపై వివరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కె నాగ శ్రీనివాసరావు, చలపతి వర్శిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నరసరావుపేట: పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లిలో గల మెడికల్‌ కళాశాల వరకు నరసరావుపేట, పిడుగురాళ్ల బస్టాండ్ల నుంచి సింగిల్‌స్టాఫ్‌ బస్సులను నిర్వహించాలని పట్టణ వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు కుంచాల స్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలో రవాణాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. గతంలో స్థానిక ఆర్‌టీసీ జిల్లా రవాణా అధికారిని కోరుతూ వినతిపత్రం సమర్పించామని, అయితే ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. బస్సుల ఏర్పాటు వలన బోధనా సిబ్బంది, చదువుకునే విద్యార్థులు, హాస్పిటల్‌లో చికిత్స కోసం వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాన్య, మధ్య, పేదతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement