గుంటూరు రూరల్: చోరీలకు పాల్పడే ముఠాను నల్లపాడు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అడవి తక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భాస్కర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... ఇటీవల జరిగిన చోరీలపై ఎస్‌ఐ మధుపవన్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన ఏడుగురు అనుమానితులను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–1 రెడ్డిపాలెం రోడ్డులో అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై నగరంలో పలు పోలీస్ స్టేషన్‌లు, నల్లపాడు, కొత్తపేట, తాడికొండ స్టేషన్‌ల పరిధిలో చోరీలు, దోపిడీ కేసులు ఉన్నాయన్నారు. నిందితులను వింజేపల్లి మేరిబాబు అలియాస్ మేరి, పావన ఫణికృష్ణ అలియాస్ పంతులు, షేక్ షరీఫుద్దీన్, పాలిపోగు శ్రీను, యరస్రాని రాజు, ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదనకు ఇలా చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గోరంట్ల గ్రామంలోని ఓ ఇంటిలో తాళాలు పగులగొట్టి వెండి పట్టీలు, చేతి గడియారం, నగదు తదితర వస్తువులు దొంగిలించినట్లు, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించి బంగారు ఉంగరాన్ని లాక్కున్నట్లు తెలిసింది. నల్లపాడు రోడ్డులోని మన్యా సూపర్ మార్కెట్‌లో రూ.1.10 లక్షల నగదు చోరీ చేసినట్లు, తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాల్లో షట్టర్లు పగులగొట్టి సిగరెట్ బాక్సులు, చిల్లర నగదు, గ్యాస్ సిలిండర్లు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. వారి నుంచి జత వెండి పట్టీలు, చేతి గడియారం, 4 గ్రాముల బంగారు ఉంగరం, వివిధ కేసులకు సంబంధించిన నగదు, రెండు గ్యాస్ సిలిండర్లు, సిగరెట్ బాక్సులు, భారీ మొత్తంలో చిల్లర నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.


