ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు సూచన
తాడికొండ: స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని మినిస్టర్స్ క్వార్టర్స్ వెనుక ఉన్న పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) జె. శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పురోగతి, భద్రత, ట్రాఫిక్, రహదారుల సదుపాయాలపై శ్యామలరావు అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ – పార్కింగ్ విషయమై వేడుకలకు వచ్చే వీఐపీలు, అధికారులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా వాహన పార్కింగ్ స్థలాలను కేటాయించాలని కోరారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా మళ్లింపు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సహాయం కోసం గ్రౌండ్ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓను కోరారు. సమావేశంలో ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర పాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, జిల్లా సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మావతి, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


