గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూర్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి జావెలిన్ త్రో పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో పలు పలు ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 7న నేషనల్ జావీలిన్ డేను పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించామని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ పోటీలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చేందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఫౌండర్ జాతీయ హమ్మర్ త్రోయర్ గారా శేషయ్య చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రసాద్‌తోపాటు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారుడు జీజే కిషోర్, శాప్ అథ్లెటిక్ కోచ్ వెంకటేశ్వరరావులు సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షకులు శివారెడ్డి, కె.రవి, దీపు తదితరులు పాల్గొన్నారు.


