అమరావతి కరకట్టపై టిప్పర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

అమరావతి కరకట్టపై టిప్పర్‌ బోల్తా

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

తాడేపల్లి రూరల్‌: రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసానికి అతికొద్ది దూరంలో టిప్పర్‌ లారీ బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తాపడింది. సేకరించిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా కంకర లోడ్‌తో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నుంచి అమరావతి కరకట్టమీదకు ఎక్కుతుండగా అదుపు తప్పి కృష్ణానదివైపునకు బోల్తా పడింది. పక్కనే భారీ వేపచెట్టు ఉండడంతో దానికి ఆనుకుని లారీ మరో పల్టీ వేయకుండా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.

పలు గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన

రైతులకు సూచనలు

తాడికొండ: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లాం ఫామ్‌ శాస్త్రవేత్తలు పర్యటించారు. తుళ్ళూరు మండలంలో పెదపరిమి – వడ్డమాను గ్రామాల్లో ఉన్న పంటలను పరిశీలించి పంటల వారీగా ఎల్‌నినో సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. మృత్తికా శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.శైలజ, సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.వెంకటరావు, తెగుళ్ల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.మనోజ్‌, ఏరువాక కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ.మనోజ్‌లు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెదపరిమి, వడ్డమాను గ్రామానికి చెందిన రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాజధానిలో మంత్రుల పర్యటన

తాడికొండ: రాజధాని ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌లు బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా నిర్మాణంలో ఉన్న బంగ్లాలు, ఐకానిక్‌ టవర్లు, ఎమ్మెల్సీ క్వార్టర్లును పరిశీలించగా వీరికి మంత్రి నారాయణ నిర్మాణ పనులను వివరించారు. అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు. డిసెంబర్‌ నాటికి అమరావతిలో 4వేల ఇళ్లు ప్రభుత్వానికి అందజేస్తామని నారాయణ తెలిపారన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానికి మంచి ప్రణాళిక తో ముందుకెళ్తున్నామన్నారు. పలువురు సీఆర్డీయే అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement