లక్ష్మీపురం: ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతు సంఘం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. బుధవారం గుంటూరు బ్రాడీపేట లోని యుటియఫ్ హాల్లో ఔటర్ రింగ్ రోడ్ రైతుల కమిటీ సమావేశం జొన్న శివశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 121 గ్రామాలకు సంబంధించి, 23 మండలాల్లో పదివేల ఎకరాలు పైన భూములు ఔటర్ రింగ్ రోడ్డు కింద రైతులు కోల్పోతున్నారన్నారు. ఇందులో సన్నా,చిన్న కారు రైతులు అత్యధికంగా ఉన్నారన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సరైన ప్రకటన చేయకుండా రహస్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొరకు పావులు కదుపుతుందన్నారు. భూమి కోల్పోతున్న రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతులు నష్టాలు పాలు చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. 2013 భూ సేకరణ కింద ఇవ్వాల్సిన నష్టపరిహారాలు కుదించే విధంగా కొత్త జీవో తీసుకువచ్చింది అన్నారు. ఈ కొత్త జీవో వల్ల రైతులకి ఎప్పుడో పాతకాలం రిజిస్ట్రేషన్ విలువ ఉండటం వల్ల పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. సిటీ అవుట్ కట్స్‌లో ఉన్న ఈ భూములకు ప్రైవేటు మార్కెట్ కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం లక్షల్లో మాత్రమే పరిహారం అంది పరిస్థితి ఉందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వల్లూరి భారతి, ఔటర్ రింగ్ రోడ్డు రైతుల కమిటీ నాయకులు కోయ కోటేశ్వరరావు, గుంటుపల్లి సాంబశివరావు, కె. పద్మావతి, రమేషు,కాజా వెంకటేశ్వరరావు, పి.శివ పార్వతి, ములకా శివసాంబిరెడ్డి, సిహెచ్.భాస్కర్ రావు, వెంగళరెడ్డి, బి.శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య


