మంగళగిరి రూరల్: పచారీ షాపులో కావలసిన సరుకులు కట్టించుకొని అనంతరం షాపు నిర్వహిస్తున్న వృద్ధురాలపైనే కత్తితో దాడి చేసిన ఘటన మంగళగిరి పట్టణం కొత్తపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం కొత్తపేటలో నిర్మల జూనియర్ కాలేజ్ ఎదుట వాడపల్లి శ్రీలక్ష్మి అనే వృద్ధురాలు (60) భర్త చనిపోవడంతో ఒంటరిగానే జీవనం కొనసాగిస్తూ పచారీ దుకాణం నిర్వహిస్తుంది. ఇంటినే షాపుగా మార్చుకొని వ్యాపారం చేసుకుంటుంది. రోజు లాగానే మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు ఓ గుర్తు తెలియని యువకుడు షాపులోకి వచ్చి కావాల్సిన వస్తువులన్నీ కట్టించుకున్నారు. ఆ యువకుడు ఏదో వస్తువు అడిగితే ఆమె షాపులోపలికి వెళ్లిందని ఇతను కూడా ఆమెతో పాటే లోపల కు వెళ్లాడని ఆ తర్వాత యువకుడు కూరగాయల కోసే కత్తితో వీపు భాగంలో పొడిచి పారిపోయాడని స్థానికులు తెలిపారు. బహుశా యువకుడు బంగారం కోసమో, నగదు కోసమో వచ్చి ఉంటాడని అందుకే ఆమెను అనుసరించి షాపులోపలికి వెళ్లాడని, అక్కడ నగదు కాని బంగారం కాని దొరకపోవటంతో ఆమె కేకలు వేసేసరికి చేసేది లేక అక్కడే ఉన్న కూరగాయల కోసే కత్తితో పొడిచి పారిపోయి ఉంటాడని వారు అంటున్నారు. ఆమె బయటకు వచ్చి కేకలు వేయడంతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసారు. పట్టపగలే కత్తితో వృద్ధురాలపై దాడి చేయడంతో స్థానికులు విస్మయం వ్యక్తంచేస్తూ భయాందోళనలకు గురయ్యారు.


