నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎం.ఎస్.నెం.30 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలకు వేగంగా క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) చేసి హక్కు పట్టాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలోని అడవితక్కెళ్లపాడు, చౌడవరం, ప్రగతినగర్ ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన 35 ప్రత్యేక బృందాల్లోని రెవెన్యూ, ప్లానింగ్ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎటువంటి లోపాలు లేకుండా పక్కా రికార్డులు సిద్ధం చేయాలని సూచించారు. పేదలకు త్వరితగతిన హక్కు పట్టాలు అందేలా అధికారులు నివేదికల తయారీలో జాప్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, సిటీ ప్లానర్ డి.రాంబాబు, తహసీల్దార్లు సుభానీ, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


