న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం గల్లంతైన విద్యార్థిని మృతి

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల క్రికెట్‌ టోర్నమెంట్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో పోటీలను తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాటింగ్‌ చేయగా బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డి బౌలింగ్‌ చేసి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి మ్యాచ్‌లో ఈగల్‌ టీం తమ ప్రత్యర్థి ఇండియా లీగల్‌–11 జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సచిన్‌ స్పార్క్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. రెండవ మ్యాచ్‌లో 11 బుల్లెట్స్‌ జట్టు తమ ప్రత్యర్థి ప్రేమ్‌ చంద్‌ టీంపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న కె.ఆనంద్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జి.శాంతకుమార్‌, వి.బ్రహ్మారెడ్డి, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

తాడేపల్లి రూరల్‌: బకింగ్‌హామ్‌ కెనాల్‌లో దూకి గల్లంతైన విద్యార్థిని మృతదేహం మంగళవారం లభించింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్‌ సెంటర్‌ పశువుల హాస్పిటల్‌ సమీపంలో నివాసముండే సురేంద్ర, అనిత దంపతుల కుమార్తె ఐశ్వర్య (17) చదువు విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బకింగ్‌హామ్‌ కెనాల్‌ బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి గల్లంతైంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మంగళగిరి 6వ బెటాలియన్‌కు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తాడేపల్లి రూరల్‌ పరిధిలోని మెల్లెంపూడి వద్ద ఐశ్వర్య మృతదేహం లభించడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీయగానే అక్కడే ఉన్న తండ్రి సురేంద్ర కుప్పకూలిపోయాడు. ఆయన్ను ఓదార్చి బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రదీప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement