గుంటూరు ఎడ్యుకేషన్: పేదల పెన్నిధిగా, దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకటకృష్ణారావు చిరస్మరణీయుడని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కొనియాడారు. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారన్నారు. డెప్యూటీ సీఈఓ చొప్పర కృష్ణ, అకౌంట్స్ ఆఫీసర్ పుల్లగూర శామ్యూల్ పాల్, ఏఓలు రాజా రత్నబాబు, తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడారు.
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో...
నగరంపాలెం: మాజీ మంత్రి, దివంగత మండలి వెంకటకృష్ణారావు జయంతిని మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో మంగళవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి ఎస్పీ వకుల్ జిందాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడి అని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ కృష్ణయ్య, ఎస్‌బీ సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.


