ఐ–టీడీపీ పోస్టులు సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

ఐ–టీడీపీ పోస్టులు సిగ్గుచేటు

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

ఐ–టీడీపీ పోస్టులు సిగ్గుచేటు

పెమ్మసానిపై ఒక్క పోస్టు పెడితే వెంటనే కేసులా? వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకుల ధ్వజం అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసినా చర్యలేవని నిలదీత రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని మండిపాటు

వెఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు అత్తోట జోసఫ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఒక ఏఐ వీడియోపై వ్యవస్థ మొత్తం స్పందిస్తోందని, అయితే ఐ–టీడీపీ ద్వారా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చర్యలు కనిపించడం లేదన్నారు. అంబటి ఇంటిపై దాడి ఘటనలోనూ కేసులు నమోదు చేయలేదని విమర్శించారు. కూటమి పాలనలో 18 మంది ఎస్సీలు చనిపోతే హోం మంత్రి స్పందించలేదని గుర్తుచేశారు.

నగర యువజన విభాగ అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనబెట్టి అంబటి రాంబాబు పోస్టు చేసిన వీడియోపైనే చర్చ జరుగుతోందన్నారు. ఆ వీడియోలో వ్యక్తిగత దూషణలు లేదా తప్పుడు వ్యాఖ్యలు లేవని పేర్కొన్నారు. అంబటి ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు.

పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు భగవాన్‌ మాట్లాడుతూ, అంబటి రాంబాబు వీడియోలో ఎలాంటి తప్పు లేదని, ఆయనపై నమోదైన కేసులపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసుల విషయంలో పార్టీ లీగల్‌ సెల్‌ తరఫున పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

పార్టీ జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడు పఠాన్‌ సైదాఖాన్‌ మాట్లాడుతూ పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఏఐ వీడియోపై మూడు కేసులు నమోదు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు పెడుతున్న పోస్టులపై కేసులు ఉండవా అని ప్రశ్నించారు.

నగర యువజన విభాగ ఉపాధ్యక్షుడు యర్రడ్ల వెంకటేష్‌ రెడ్డి మాట్లాడుతూ, అంబటి రాంబాబు ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియో పోస్టు చేసిన రెండు రోజుల్లోనే మూడు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. ఆయన ఇంటిపై దాడి జరిగి ఆరు నెలలు గడిచినా కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. ఐ–టీడీపీ సోషల్‌ మీడియా వేదికల్లో వైఎస్‌ జగన్‌, అంబటి రాంబాబుపై వస్తున్న పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐ–టీడీపీ పోస్టు చేసిన వీడియోలను ట్యాబ్‌లో చూపించారు.

పార్టీ నగర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పల్లపు మహేష్‌ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకున్నా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏఐ వీడియోలకే కేసులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రికే రక్షణ కల్పించలేని పరిస్థితిలో సామాన్యులకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అంబటి పేరు వింటేనే చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్ని కేసులు నమోదు చేసినా తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.

పశ్చిమ యువజన విభాగ అధ్యక్షుడు కానూరి శశిధర్‌ మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న ఐ–టీడీపీ సోషల్‌ మీడియా గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అంబటి రాంబాబు ఇంటిపై ఎంపీ సూచన మేరకు ఒక ఎమ్మెల్యే దగ్గరుండి దాడి చేయించారని తెలిపారు. జరిగిన దాడికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: సభ్య సమాజం తలదించుకునేలా ఐ–టీడీపీ సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులపై పోలీసులు దృష్టి సారించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు చేసే పోస్టులపై మాత్రం అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కారణంగా గుంటూరులో రాజకీయ వైషమ్యాలు పెరిగాయని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ప్రోద్బలంతో గత జనవరి 31వ తేదీన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు. ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు పెట్రోలు బాంబులు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడైన అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేశారని విమర్శించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని అంబటి రాంబాబు అప్పటి నుంచి డిమాండ్‌ చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. అయితే, పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేసిన వెంటనే మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, చట్టబద్ధంగానే పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో నగర ఎస్సీ విభాగ అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్‌, నగర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జి. ప్రభు, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు వేణు, విద్యార్థి విభాగ అధ్యక్షుడు భాను, డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు రెడ్డి కోటేశ్వరరావు, నాయకులు షర్ఫుద్దీన్‌, సుబ్బారావు, బత్తుల వెంకట్రావు, టీవీఎల్‌ పవన్‌, ఆటో మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement