వినతిపత్రం అందజేత
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజనులో వరి సాగుకు నీరు ఇచ్చి తీరాల్సిందేనని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. లేకుంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమ డెల్టాకు సాగునీటి సాధన కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు డెల్టా పరిరక్షణ సమితిగా ఏర్పాటయ్యారు. శనివారం మధ్యాహ్నం స్థానిక వార్ఫ్ రోడ్డులోని జలవనరుల శాఖ పశ్చిమ డెల్టా ఈఈ కార్యాలయానికి వెళ్లారు. వరి సాగుకు నీరు విడుదల చేయకపోవడం, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెప్పడంపై జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య ప్రశ్నించారు. సబ్సిడీ విత్తనాలు రైతులకు పంపిణీ చేసి, వాటిని చేలల్లో వెదజల్లి పైరు పెరుగుతున్న దశలో నీరు ఇవ్వలేమని చెప్పటం అర్థరహితంగా పేర్కొన్నారు. పులిచింతల రిజర్వాయరు నుంచి గత మే నెలలో 10 టీఎంసీల నీటిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈఈ ఎస్.సుధాకర్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ వేసవిలో అనవసరంగా నీటిని వృథా చేశారని విమర్శించారు. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నుంచి ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు సమాధానంగా ఈఈ మాట్లాడుతూ ఆ నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు నిల్వచేసి, తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని చెప్పటంతో నాయకులు మండిపడ్డారు. ఇప్పుడు పంటల అవసరానికి నీరివ్వకుండా ఏడాదిపాటు నిల్వ చేయటం ఏమిటని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోంది అధికారులేనని అయితానగర్ రైతుసంఘం నాయకుడు ఈదర పూర్ణచంద్ ఆరోపించారు. కృష్ణానదికి వరద ఆరంభమైందని, గోదావరి నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని చెబుతూ ఈ సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాగునీరు ఇవ్వలేమని చెప్పటం బాధ్యతారాహిత్యమని పూర్ణచంద్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికై నా పులిచింతల, పట్టిసీమ నుంచి అవసరమైన మేరకు సాగు నీటిని విడుదల చేయాలని కోరారు.
ఏటా జూలై 15వ తేదీకల్లా డెల్టా కాల్వలకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని, పులిచింతలలో జూలై 15వరకు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చూడాలని, పట్టిసీమ కాల్వ సామర్థ్యం పెంచాలని, ప్రకాశం బ్యారేజి ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద బ్యారేజీ నిర్మించాలని, ప్రకాశం బ్యారేజీ ఎగువ పూడిక తీయాలని, దిగువను చెక్ డ్యామ్‌లు నిర్మించి సముద్రపు నీరు చొచ్చుకురాకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మారౌతు సీతారామయ్య, మైనేని రత్నప్రసాద్, ఈదర పూర్ణచంద్, డాక్టర్ చందు సాంబశివుడు, కొల్లిపర బాబుప్రసాద్, చెరుకుమల్లి సింగారావు, చవ్వాకుల రాఘవరావు, కేవీ సత్యనారాయణ, జె.శంకరరావు, పొన్నూరు నాగసూర్య శశిధరరావు, ఇ.వెంకటేశ్వరరావు, పి.స్టీవెన్ బాబు, కె.కోటేశ్వరరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


