కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంట మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకూ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 31వ తేదీతో ముగిసిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజులపాటు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయశాఖ దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు బీమా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరి పంటలకు యథావిధిగా ఆగస్టు 15వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు ఉందని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, రైతులు వీలైనంత త్వరగా బీమా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
తాడేపల్లి రూరల్: చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ అధ్యక్షుడు అశోక్‌సింగ్ జాదోన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గుహలను ఆయన శనివారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా ఉండవల్లి గుహలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని అశోక్‌సింగ్ జాదోన్ పేర్కొన్నారు. రెండవ అంతస్తులో శయనిస్తున్న అనంత పద్మనాభస్వామి విగ్రహం అత్యంత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉండవల్లి గుహలను సందర్శించిన వారిలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, పరిషత్ సంయుక్త కార్యదర్శి గొల్ల మాల్యాద్రి తదితరులు ఉన్నారు.
నరసరావుపేట ఈస్ట్: శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాసంస్థల గుంటూరు విభాగ్ స్థాయిలో రెండు రోజులపాటు నిర్వహించిన ఖేల్ కూద్ పోటీలు శనివారం ముగిశాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని శిశుమందిర్ పాఠశాలల నుంచి దాదాపు 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌తోపాటు వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో గుంటూరు విభాగ్ కార్యదర్శి సి.హెచ్.గోపీకృష్ణ, పాఠశాల కార్యదర్శి కొత్త రాము, పాఠశాల సమితి అధ్యక్షుడు మిరియాల నాగప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొని విజేతలను అభినందించారు.
తాడికొండ: ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో కలిసి శనివారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆస్ట్రేలియా బృందం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, వారు అమరావతి అభివృద్ధి ప్రణాళికలను తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో భవిష్యత్ సహకార అవకాశాలపై సీఆర్డీఏ అధికారులతో ఆస్ట్రేలియా బృందం చర్చలు జరిపింది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి బృంద సభ్యులకు వివరించారు.


