వైభవంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

వైభవంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం

ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు 2, 599 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం

చేబ్రోలు: సాంకేతిక పరిజ్ఞానం అపార అవకాశాలను అందిస్తున్నప్పటికీ, అదే సమయంలో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదాన్ని కూడా తెచ్చిందని అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణి హెచ్చరించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 14వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే సామర్థ్యం యువతకు అత్యవసరమని అన్నారు.

ముగ్గురు ప్రముఖులకు

గౌరవ డాక్టరేట్లు

స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లను వివిధ రంగాలలో కృషి చేసిన హైదరాబాద్‌లోని నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్‌ నన్నపనేని, గ్రీన్‌కో ఫౌండర్‌, ప్రెసిడెంట్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ కొల్లి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 2,599 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీటితోపాటు 63 విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.

పరిశోధనలు సమాజానికి మేలు చేసేలా..

నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్‌ నన్నపనేని మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించారు. ఆరోగ్య రక్షణ రంగానికి సాంకేతికత తోడైతే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చన్నారు. యువత నిరంతర పరిశోధనలపై దృష్టి సారించాలని కోరారు. నాట్కో సంస్థ ప్రస్థానం ఈ ప్రాంతం నుంచే, వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు సాధించిన మార్కులు, రాసిన పరీక్షలు కేవలం ప్రాథమిక జ్ఞానాన్ని అందించే మార్గాలు మాత్రమేనని, అవి మాత్రమే భవిష్యత్‌ను నిర్ణయించలేవని అభిప్రాయపడ్డారు.

గ్లోబల్‌ ఎనర్జీలో భాగస్వామ్యం..

గ్రీన్‌కో వ్యవస్థాపకులు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ కొల్లి మాట్లాడుతూ గ్లోబల్‌ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ ప్రక్రియలో భారతదేశం కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా, ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయికి చేరిందని వివరించారు. పర్యావరణహిత స్వచ్ఛ ఇంధనం, నిరంతర శక్తి నిల్వ దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో స్పష్టమైన విజన్‌, సరికొత్త సాంకేతికతలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. భారతదేశానికి ఉన్న విస్తారమైన వనరులు, సాంకేతిక నైపుణ్యం దేశాన్ని గ్లోబల్‌ క్లీన్‌ ఎనర్జీ లీడర్‌గా నిలబెడతాయన్నారు.

బంగారు పతకాల విజేతలు వీరే..

స్నాతకోత్సవం సందర్భంగా ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ప్రతిష్టాత్మక చైర్మన్స్‌ గోల్డ్‌ మెడల్‌– పరుచూరు తరుణ్‌( ఏఐ అండ్‌ ఎంఎల్‌), ఎండోమెంట్‌ అవార్డులు– చల్లగుల్ల తేజ అమృత సాయి, భవ్యశ్రీ ముప్పాళ్ల, కె.కార్తికేయ, బెస్ట్‌ లీడర్‌ అవార్డు– హరిదాసు సాహితి, బెస్ట్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌ – చాగం రాఘవి, మేజర్‌ తీగవరపు శ్రీతేజ భరద్వాజ్‌ మెమోరియల్‌ అవార్డ్‌– నాగ సంహిత, బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌– సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌ వలంటీర్‌– బి.నాగ ప్రీతిక రెడ్డి, బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ ఫ్రమ్‌ హాస్టల్స్‌– కె.సాయి సత్యకృష్ణ, ముత్యాలంపల్లి ప్రణీత, ఎగ్జంప్లరీ స్టూడెంట్‌ అవార్డు– వి.శ్రీసాయి హిమజ తులసి తదితరులకు బంగారు పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్‌ పావులూరి సుబ్బారావు, సీఈఓ డాక్టర్‌ మేఘన కూరపాటి, వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement