● రెండేళ్లలో కొత్త పింఛన్
ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం
● దరఖాస్తులు ఇవ్వాలంటూ
ప్రకటనలతో సరి
● ప్రతి నెలా అడ్డగోలు
కారణాలతో లబ్ధిదారుల తొలగింపు
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోలేదని అర్హులు చెబుతున్నారు. కుటుంబానికి ఆధారం కోల్పోయిన అనేక మంది వితంతువులు రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ వస్తే కనీసం మందుల ఖర్చులకై నా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుందని వారు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొంటున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో భేష్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసేవారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి, అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అందించేవారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలకు భర్త మరణిస్తే తదుపరి నెల నుంచే వితంతు పింఛన్ మంజూరు చేసేవారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల వ్యవధిలోనే మంజూరు అయ్యేది. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందించేవారు. ప్రతి నెల మొదటి తేదీ తెల్లవారుజామునే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు.
నెలలోనే 2,981 తగ్గింపు
జిల్లా వ్యాప్తంగా ఒక్క నెలలోనే 2,981 పింఛన్లు తగ్గాయి. జూలైలో 2,51,771 పింఛన్లు ఉండగా, ఆగస్టు నాటికి అవి 2,48,790కు చేరాయి. అధికారులను ప్రశ్నిస్తే, మరణాలు తదితర కారణాలతో తొలగించాల్సి వస్తోందన్నారని స్థానికులు చెబుతున్నారు. కొత్తవి మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను వివిధ కారణాలతో తొలగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలను నిరాశపరుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాలేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటికే ఉన్న పింఛన్లలోనూ కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.


