గుంటూరు వెస్ట్: ప్రతి నియోజకవర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి.) సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజకవర్గాలలో భూములను గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క మోడల్‌లో ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా ఎగుమతుల ప్రణాళిక ప్రతిపాదించామని పేర్కొన్నారు. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. డి.ఐ.ఇ.పి.సి. సమావేశంలో 11 ఎం.ఎస్.ఎం.ఇ. సంస్థలకు పెట్టుబడి, వడ్డీ, విద్యుత్, సాంకేతిక అప్‌గ్రేడేషన్ కింద రూ.1.53 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపారు. జూలై 4 నుంచి 30వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్‌లో అందిన 55 దరఖాస్తులలో 24 దరఖాస్తులకు నిర్దేశిత సమయంలో ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనంతదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


