గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయికుమార్, పంచాయతీ సెక్రటరీ రాంకుమార్‌లపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ విచారణ చేపట్టారు. బీవీ నాగసాయికుమార్, పంచాయతీ సెక్రటరీ రాంకుమార్‌లు జేసీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. బాధితులు దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొందలపాటి శివనాగేశ్వరరావు (80), ఆయన భార్య అంజని సామ్రాజ్యం ఇచ్చిన లిఖతపూర్వక ఫిర్యాదుపై పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టామని జేసీ తెలిపారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ గతంలో తన ఇంటి ముందు ఉన్న మెట్లను మాయమాటలు చెప్పి తొలగించడంలో డీపీఓ నాగసాయి కుమార్, మాజీ పంచాయతీ సెక్రటరీ రామ్‌కుమార్ (ప్రస్తుతం డిప్యూటీ ఎంపీడీఓ తెనాలి)ల పాత్ర ఉందన్నారు. ఆ తర్వాత వాటిని పునర్‌నిర్మించడానికి తమ నుంచి లంచం డిమాండ్ చేశారన్నారు. దీంతోపాటు డీపీఓ తన వద్ద తుపాకీ లైసెన్స్ ఉందని ఏమైనా చేయగలని బెదిరించారన్నారు. 16 ఇళ్లలో తమ ఇంటిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడానికి కారణం కేవలం వారడిగిన లంచాలు ఇవ్వలేదనే కక్షతోనేనన్నారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా వృద్ధులమనే కనికరం కూడా లేకుండా దారుణంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ నిష్పక్షపాత విచారణ చేపట్టి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: ఆటో ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబరు హైవే దిగి సర్వీస్ రోడ్డులో నడిచి నడిచి వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని అటువైపుగా వెళ్తున్న ఆటో బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 ఏళ్లు ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలిసిన వారు ప్రత్తిపాడు పోలీసులకు లేదా 8688831386 నంబరును సంప్రదించాలని ఎస్‌ఐ ఎన్.నరహరి కోరారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలేనికి చెందిన గుళ్లపల్లి ఏసుబాబు, సతీష్ శనివారం రాత్రి బైక్‌పై గుంటూరు నుంచి కోయవారిపాలెం వస్తూ స్థానిక ప్రైవేట్ వెంచర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగారు. అదే సమయంలో పెదనందిపాడుకు చెందిన గొలస సురేష్‌బాబు మరో వ్యక్తితో కలిసి టూవీలర్‌పై గుంటూరు నుంచి ప్రత్తిపాడు వైపు వెళుతున్నాడు. ఆగి ఉన్న టూవీలర్‌ను సురేష్‌బాబు వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఏసుబాబు, సతీష్ గాయాలపాలవ్వగా, సురేష్‌బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్‌లలోని కీలక రైల్వేస్టేషన్‌లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. స్టేషన్‌లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ డీఆర్‌ఎంతో కలసి రాయనపాడులో జరుగుతున్న ఆర్‌ఓబీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. గంగినేని స్టేషన్‌ను ఆయన క్షుణంగా తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎర్రుపాలెం స్టేషన్‌లో యార్డు ప్రణాళిక, ప్రతిపాదిత నంబూరు కొత్త లైన్‌ల పనులను అధికారులతో సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాక్, స్టేషన్ అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. భవిష్యత్తు సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని మంచి ప్రణాళికలతో పనులు పూర్తిచేయాలని సూచించారు. అక్కడ నుంచి మధిర స్టేషన్‌ను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని అంచనా వేసి పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.
జీఎంను కలసిన ఎస్సీ, ఎస్టీ
అసోసియేషన్ నేతలు
దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ విజయవాడ డివిజన్ పర్యటన సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ కమిటీ నేతలు శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలసి సత్కరించారు. అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షుడు బి.వి.నాయక్ డివిజన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రం సమర్పించారు.


