మాదక ద్రవ్యాల కట్టడిపై చంద్రబాబు సర్కార్ ప్రగల్భాలు జిల్లా వ్యాప్తంగా ఏఆర్ ఎస్‌ఐ, మరో ఐదుగురే.. మొత్తం సిబ్బంది ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క చర్య కూడా తీసుకోని వైనం కేవలం ర్యాలీలు.. ప్రకటనలకే అధికారులు పరిమితం
పాత కేసులతో సరి...
చంద్రబాబు చెప్పేవన్నీ ఫలితం లేని మాటలే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆయన తన ధోరణి ఏనాడూ మార్చుకోలేదు. దీనికి మరో నిదర్శనంగా ఈగల్ టీం పనితీరు ఉంది. రాష్ట్రంలో ఈగల్ పేరుతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను గతంలో ఏర్పాటు చేశారు. అయితే పేలవమైన పనితీరుతో అది కాస్తా చేతులెత్తేసింది. దీంతో జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. విద్యార్థులు, యువత మత్తులో చిత్తవుతూ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. వారి ప్రవర్తనతో కన్నవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
పట్నంబజారు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ‘ఎలైట్ యాంటీ – నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్)ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మత్తు పదార్థాలను ఎక్కడ ఉన్నా పట్టేస్తామని, నిందితులకు చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలికారు పాలకులు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకొంటూ ఇన్నాళ్లు కాలం గడిపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈగల్ తన మార్క్ చూపలేకపోతోంది.
ఇవిగో నిదర్శనాలు....
గత రెండు రోజుల వ్యవధిలో పాతగుంటూరు, కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, గోవా, పాడేరు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకుని వస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గోవా నుంచి మత్తు బిళ్లలు అధికంగా దిగుమతి అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తన కుమార్తె డ్రగ్స్‌కు బానిసగా మారిందని.. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవటం లేదని గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ తల్లి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పరిస్థితికి అద్దం పట్టింది. దీంతో డ్రగ్స్ సరఫరా కళాశాలల వరకు ఉందని మరోమారు స్పష్టం అయ్యింది. మంగళదాస్‌నగర్‌కు చెందిన ఒక పదో తరగతి విద్యార్థినిని మత్తు పదార్థాలైన గంజాయి, ఇతరత్రా వాటికి అలవాటు చేసి ఆమైపె ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి వదిలేశారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పోలీసు అధికారులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరుగా జిల్లా స్థాయి అధికారులే పలు సందర్భాల్లో స్పష్టంగా కొన్ని కళాశాలల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పిన పరిస్థితులున్నాయి. ఇదే కాకుండా గోవా ఇతర ప్రాంతాల నుంచి పలు రకాల మత్తుబిళ్లలు, ఇంజెక్షన్లు తీసుకుని వస్తూ పట్టుబడుతున్నారు. దీనిని అరికట్టడటంలో ఈగల్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా కళాశాలల వద్దే గంజాయి, ఎండీఎంఏ, క్రిస్టల్ వంటివి విద్యార్థులకు అందుతున్నా ఎక్కడ నుంచి వస్తున్నాయనే స్పష్టత ఇప్పటికీ అధికారులకు రాలేదు.
నిఘా బలోపేతమే మార్గం
జిల్లాకో నార్కోటిక్ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఇది ఎక్కడ ఉందో చెప్పనే లేదు. పైగా ఈగల్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు హామీకు అతీగతీ లేదు. ఇప్పటివరకు ఏం చర్యలు చేపట్టారన్నది ప్రశ్నార్థకం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మాదకద్రవ్యాల వినియోగంపై నిఘా ఉంచి, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పౌరులను ఇందులో బాధ్యులుగా చేస్తూ గంజాయి విక్రయాలు, ఉపయోగాలపై రహస్యంగా సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును కాపాడాలని పేర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ‘ఈగల్’ను తీసుకొచ్చింది. గంజాయి స్మగ్లింగ్, మత్తు పదార్థాల వినియోగం, మత్తెక్కించే రసాయనాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడికి ప్రతి జిల్లాలో ఈగల్ పని చేయనున్నట్లు పేర్కొంది. మత్తుపదార్థాలు ఎక్కడైనా ఉపయోగించినా, స్మగ్లింగ్ చేసినా సమాచారం ఇవ్వడానికి 1972 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని నియమించింది. అయితే ఈగల్ గట్టి కేసును ఛేదించింది లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆయా స్టేషన్ పరిధిలో పట్టుకున్న మత్తు పదార్థాలకు సంబంధించి ఈగల్ సభ్యులు కూడా ఉన్నట్లు చెప్పుకోవటం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. ఈగల్ అనేది కేవలం ర్యాలీలు.. అవగాహన సదస్సులు.. ఫొటోల సెషన్‌లకు మాత్రమే పరిమితం అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఇప్పటికే ఈగల్ బృందం ఏర్పాటైంది. దీనికి ఓ ఎస్‌ఐతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్‌న్ పరిధిలోనైనా ఈగల్ బృందం మాదకద్రవ్యాలపై దాడులు చేయవచ్చు. అయితే గతంలో విక్రయాలు జరిపిన వారు, సేవించిన వారిని పట్టుకుని చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయిని సైతం పాడేరు, గోవా, ఒడిశా ప్రాంతాల నుంచి నేరుగానే తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈగల్ ఏర్పాటయ్యాక జిల్లాలో పెద్దగా ఎక్కడా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. సొంతంగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసిన దాఖాలలే లేవు. అసలు ఈగల్ బృందంలోని సిబ్బందికి కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం. మెలకువలు, నిందితుల డేటా విశ్లేషణ, ఆర్థిక లావాదేవీలపై కనీస పరిజ్ఞానం కూడా లేనట్టు తెలుస్తోంది. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బందికి 30 శాతం అలవెన్సు సౌకర్యం కల్పించడంతో కేవలం ఆరుగురికే పరిమితం చేశారనే వాదనలు ఉన్నాయి.


