డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు నిరంతర పోరాటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ముఖ్య నేతలు
నిరుద్యోగులకు ఆవేదన
గుంటూరు వెస్ట్: కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాసిన ప్రతిభావంతులైన అభ్యర్థులను పక్కనపెట్టి, అక్రమ మార్గంలో తనకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, అసెంబ్లీ పరిశీలకుడు నిమ్మరాజు నారాయణ, మదన్ మోహన్ గౌడ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కుమ్మరి–శాలివాహన కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మండేపూడి పురుషోత్తం, రాష్ట్ర పంచాయతీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మేకతోటి వీరయ్య, రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్–3 అధ్యక్షుడు వంగా సీతారామిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు నేలటూరి సుందరరావు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, నగర అధ్యక్షుడు యాదాల చిన్న, నగర ఉపాధ్యక్షుడు ఎం. శివశంకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, ఆర్‌ఎంబీ మాజీ డైరెక్టర్ పిల్లి మేరి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పి. కవిత, ఎస్సీ సెల్ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు జి. ప్రభు, ఎస్‌ఈసీ సభ్యులు నున్నా సునీత, స్వర్ణలత, తాడిబోయిన వేణుగోపాల్, దానం వినోద్, వెంకటేశ్వరరెడ్డి, బుల్ల మేరీ కుమారి, రజియా, యపత్రి కోటి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలు రాసి మోసపోయిన నిరుద్యోగుల బాధను చూసి కూడా చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌తో వెంటనే రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు, యువతకు అన్యాయం జరిగితే వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. యువత ఆగ్రహానికి గురికాకముందే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


