జిల్లాలో 2.37 లక్షల ఓట్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 2.37 లక్షల ఓట్లు రద్దు

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

జిల్లాలో 2.37 లక్షల ఓట్లు రద్దు

ఓటర్ల డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ విడుదల చేసిన జిల్లా అధికారులు జిల్లాలో ప్రస్తుతం 15,64,518 మంది ఓటర్లు గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 59,334 ఓట్లు గల్లంతు జూలై 24న జాబితాకు, ప్రస్తుత డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌కు మధ్య వ్యత్యాసం గడువు తేదీ పొడిగించినా తేడా రావడంపై పలు పార్టీల అభ్యంతరం

నెహ్రూనగర్‌: ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) షెడ్యూల్‌లో భాగంగా నిర్వహించిన ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌)ను శుక్రవారం జిల్లా అధికారులు విడుదల చేశారు. గత నెల 24వ తేదీతో ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,02,074 ఓటర్లు ఉండగా, ఆబ్సెంట్‌, పర్మినెంట్‌ షిఫ్టింగ్‌, మరణాలు (ఏఎస్‌డీ) తదితర కారణాలతో 2,37,513 ఓట్లు తొలగించినట్లు మొదట అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. అయితే జూలై 31న విడుదల చేసిన తాజా డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌లో గల్లంతైన ఓట్ల సంఖ్య 2,37,556గా పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 15,64,518 ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై 24న విడుదల చేసిన వివరాలకు, జూలై 31న విడుదల చేసిన ముసాయిదా జాబితాకు మధ్య ప్రతి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ఓట్ల వ్యత్యాసం కనిపించడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ప్రతిపక్షాలకు చెందిన ఓట్ల తొలగింపు జరుగుతోందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోనే 1,08,311 ఓట్లు గల్లంతు

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 59,334 ఓట్లు తొలగించబడినట్లు డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌లో వెల్లడించారు. అనంతరం గుంటూరు తూర్పులో 48,977, ప్రత్తిపాడులో 34,420, మంగళగిరిలో 26,989, తెనాలిలో 26,182, పొన్నూరులో 24,022, తాడికొండలో 17,632 ఓట్లు గల్లంతైనట్లు పేర్కొన్నారు. గుంటూరు నగర పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,08,311 ఓట్లు తొలగించబడటం గమనార్హం. ఈ ఓట్లలో ఎక్కువ భాగం డబుల్‌ ఓట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి కావచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 31,744 డబుల్‌ ఓట్లు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement