జిల్లాలోని ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల్లో వసతుల కొరత
ఏడాదికి సుమారు రూ. 1,500 కోట్లు ఆదాయం
మౌలిక సదుపాయాలకు పైసా ఖర్చు పెట్టని చంద్రబాబు సర్కార్
సదుపాయాలు లేవు
ప్రజలకు తీవ్ర అసౌకర్యం
ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పారదర్శకంగా, సులభతర పాలన అందించడంలో నిర్లక్ష్యం చూపుతోంది. కనీస బాధ్యతల నుంచి తప్పుకుని ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసతుల కొరత వేధిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కాసుల రాబడిపైనే పూర్తి దృష్టి పెట్టింది.
గుంటూరు వెస్ట్: ఉమ్మడి జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో గుంటూరు, తెనాలి, మంగళగిరి తదితర 8 మాత్రమే ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది రూ.కోట్ల అద్దె చెల్లిస్తున్నారు. వీటి ద్వారా సుమారు రూ. 1,500 కోట్లు ఆదాయం వస్తున్నా సొంత భవనాల ఏర్పాటుకు మాత్రం ప్రయత్నించడం లేదు. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జూలై 1, 1872న ప్రారంభమైంది. ఇప్పటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది. అంటే సుమారు 150 ఏళ్లుగా అదే ప్రదేశంలో ఒకే కార్యాలయం కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కొందరు దాతలు సొంత ఖర్చుతో కొన్ని ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాలను బాగు చేయించారు. రోజురోజుకూ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, ఆ స్థాయిలో ఎస్‌ఆర్‌ఓలు సరిపోవడం లేదు. ఇరుకు సందుల్లో కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మౌలిక సదుపాయాల కొరత
రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఖజానాకు రూ.కోట్లు సమకూరుతున్నా, కార్యాలయాల్లో కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కూర్చునేందుకు కుర్చీలు కూడా చాలా కార్యాలయాల్లో లేవు. గుంటూరు ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో వర్షం వస్తే చాలు పైకప్పు కారిపోతోంది. దస్తావేజులు తడవకుండా పట్టలు కప్పుతున్నారంటే నమ్మాల్సిందే. అధికారులు కూడా అద్దె భవనాల యజమానులకు ఈ విషయాన్ని చెప్పడం లేదు. గతంలో కొందరు జిల్లా అధికారులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వంతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు వివరించినా, వారు పెడచెవిన పెట్టారు. ఇక కార్యాలయాల్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు కూడా ఎప్పటివో. ఇది సరిపోదన్నట్లు ప్రభుత్వం ఆర్‌ఎస్‌కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు) పేరుతో జీవో నంబర్ 396 విడుదల చేసి, పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోంది.
వసతుల ఏర్పాటు కోసం ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశాం. రూ. వందల కోట్లు ఆదాయం వస్తోంది. అందులో ఒక్క శాతం అయినా ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తే ఎంతో బాగుంటుంది. 150 ఏళ్లుగా ఒకే కార్యాలయం ఉండటం గమనార్హం.
– బత్తుల దాసు, గుంటూరు
నిత్యం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. నల్లపాడు, కొరిటెపాడు వంటి కొన్ని కార్యాలయాలు మరీ ఇరుకుగా ఉన్నాయి. టూ వీలర్ పార్కింగ్‌కు కూడా అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి కనీస వసతులు కల్పించాలి.
– భాస్కరరావు, గుంటూరు


