● నేటితో ముగియనున్న పంటల బీమా పథకం గడువు ● జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ | - | Sakshi
Sakshi News home page

● నేటితో ముగియనున్న పంటల బీమా పథకం గడువు ● జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ

Jul 31 2026 1:39 AM | Updated on Jul 31 2026 1:39 AM

● నేటితో ముగియనున్న పంటల బీమా పథకం గడువు ● జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ 294 గ్రాముల బంగారం దొంగతనం

గుంటూరు వెస్ట్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన మినుములు, పప్పులు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో ఇరిగేషన్‌ ఎస్‌ఈ వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తక్కువ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో కూడిన సాగు విధానాల వైపు రైతులు మళ్లాలని ఆయన కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడటంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. భూసారం , నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పంటల సాగులో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వాతావరణ సమాచారం, పంటల ఎంపిక, పంట బీమా తదితర అంశాలపై సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు సిద్ధమన్నారు. జిల్లాలో పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు బీమా పథకంలో చేరాలని సూచించారు. ఈ పంటల బీమాకు గడువు నేటితో ముగుస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 4 వేల హెక్టార్లకు సంబంధించి రైతులు బీమా చేయించారని చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్రబాబు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణా అరికట్టడం సామాజిక బాధ్యత

మానవ అక్రమ రవాణా అత్యంత దారుణమైన అంశమని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ పిలుపునిచ్చారు. షాడోస్‌, వెట్టి చాకిరి విమోచన కోయిలేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పోస్టర్‌ గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విడుదల చేశారు. కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ఎ.గాయత్రి దేవి, షాడోస్‌, వెట్టి చాకిరి విమోచన కోయిలేషన్‌ సంస్థ ప్రతినిధులు ఎ.రాజ సాల్మన్‌, భాగ్యలక్ష్మి, అలేఖ్య, పావని, డీబీఆర్సీ సురేష్‌ పాల్గొన్నారు.

దాచేపల్లి: ఇంటి తాళం పగలగొట్టిన దుండగుడు బుధవారం అర్ధరాత్రి 294 గ్రాముల బంగారం చోరీ చేశారు. బాధితుల కథనం ప్రకారం... దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురానికి చెందిన స్వామి శ్రీనివాసరావు బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటికి రంగులు వేయించేందుకు దాచేపల్లిలో ఉన్న మరో ఇంటిలోకి సామగ్రి సర్దుతున్నారు. బుధవారం రాత్రి వరకు కొన్ని సర్దుకుని ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం నారాయణపురంలోని ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టినట్లుగా గుర్తించారు. బీరువాల తాళాలు కూడా ధ్వంసమై కనిపించాయి. వాటిలో భద్రపరచిన 294 గ్రాముల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement