పంట బీమా కోసం పాట్లు | - | Sakshi
Sakshi News home page

పంట బీమా కోసం పాట్లు

Jul 31 2026 1:39 AM | Updated on Jul 31 2026 1:39 AM

● ఎల్‌నినో పరిస్థితుల్లో బీమాపై ఆశలు పెట్టుకున్న రైతులు ● ప్రీమియం చెల్లించేందుకు బ్యాంకులు, సీఎస్‌సీల వద్దకు పరుగులు

వరి కాకుండా ఇతర పంటలు వేయాలి

కొరిటెపాడు (గుంటూరు): వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాల ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే దశకు చేరుకుంది. శుక్రవారం వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. అసలే ఎల్‌నినో పరిస్థితులు ఉండటం, సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జీవనాడిగా భావిస్తున్న ఉద్యాన పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉండటంతో రోజురోజుకూ టెన్షన్‌ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం బీమా కింద పరిహారం ఇవ్వకపోయినా.. ఈసారి ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, మొదట్లోనే కరువు కబళించే పరిస్థితులు ఉండటంతో బీమాపై ఆశలు వదులుకోకుండా ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు.

ప్రీమియం కోసం అవస్థలు

బీమా పథకాల కింద నోటిఫై చేసిన ఐదు రకాల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద వరి, పండు మిరప, మినుము పంటలు ఉండగా.. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, అరటి పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెల 31వ తేదీలోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వ్యవసాయశాఖ, ఆర్‌ఎస్‌కేలు, బ్యాంకులు, మీ–సేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎస్‌సీ) చుట్టూ రైతులు పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన పంటలు కలిపి 3,369.71 హెక్టార్లలో సాగు చేస్తున్న 457 మంది రైతులు ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న ఈ ఒక్క రోజులో ఎంతమంది చెల్లిస్తారో వేచి చూడాలి. మరో వారం, పది రోజులు గడువు పొడిగిస్తే కానీ రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు.

ప్రభుత్వ తీరుపై మండిపాటు

ఖరీఫ్‌ ప్రారంభమైన 40 రోజుల తర్వాత ప్రభుత్వం బీమా పథకాల నోటిఫికేషన్‌ విడుదల చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అప్పటికే బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్స్‌, కొత్త రుణాల పంపిణీ సుమారు 90 శాతం పూర్తికావడంతో.. 60 నుంచి 70 శాతం మంది రైతులు పత్తి, వరి పంటల కింద రుణాలు తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేశారు. అయితే వర్షాభావం, ఇతర కారణాల వల్ల పత్తి పంట సాగు విస్తీర్ణం కేవలం 6,800 హెక్టార్లకు పడిపోయింది. పత్తి పంట కింద రుణం తీసుకుని ప్రీమియం చెల్లించినట్లు నమోదు చేసుకున్న రైతులు పొలంలో పత్తి సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పంట మార్పిడి చేయించుకుని.. సాగు చేసిన లేదా సాగు చేయబోతున్న పంటకు ప్రీమియం చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement