మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెగా డీఎస్సీ స్కాంపై జూలై 31 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సమష్టిగా నిర్ణయించారు. గురువారం గుంటూరు నగరంలో సిద్ధార్థనగర్‌లోని మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరసన కార్యక్రమాలపై చర్చించారు. శుక్రవారం డీఎస్సీ స్కాంపై జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ సదస్సులు, ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహారదీక్షలు, 10న నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా సన్నద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగులను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
రెడ్ బుక్ రాజ్యాంగంపై పోరాటం
మాజీ ఉప సభాపతి, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేయని పోలీసులు.. అంబటిపైనే కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్‌కు నిత్యం వినతులు వస్తున్నాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజులు, నిరుద్యోగ భృతిపై ప్రజలను మేల్కొలుపుతామన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు.
బాధితుడినే జైల్లో పెట్టారు
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధితుడైన అంబటి రాంబాబును జైల్లో పెట్టారని, దాడికి పాల్పడిన వారిని వదిలేశారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 10 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.
లోకేష్ రాజీనామా చేయాలి
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాల కారణంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకై తే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే, డీఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్ చేయాలన్నారు. నిరుద్యోగభృతి పేరుతో మోసగించారని, ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రూ. 75 వేలు బకాయి పడ్డారని అన్నారు.
ఆ పరిస్థితులే ఏపీలో రానున్నాయి
గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ ఢిల్లీలో పరిస్థితులు ఏపీలో రానున్నాయని, పోలీసులకు చట్టం అంటే లెక్కలేదు, కోర్టులు అంటే భయం లేదన్నారు. వమాజీ మంత్రి అంబటిపై జరిగిన దాడిలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి దాడిలో దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కూటమి నీచ రాజకీయాలు
తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో నీచమైన రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై అధికార పార్టీ నాయకులే దాడికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. విద్యార్థులకు రూ.11 వేల కోట్లకుపైగా ఫీజు బకాయిలు ఉంటే, తాజాగా రూ. 600 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ముస్తఫా అక్రమ కేసు మోపారన్నారు.
జగన్ పాలనలో పారదర్శకత
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో లక్షలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ చేసినా అవినీతికి అస్కారం ఇవ్వలేదన్నారు. డీఎస్సీలో లోకేష్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి, విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు లేవన్నారు.
విద్యార్థులకు, యువతకు అన్యాయం
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు లేనప్పుడు సామాన్యులకు దిక్కేదని అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు పెట్టారని, కాజా టోల్‌ప్లాజా సీసీ ఫుటేజ్ చూస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి, పత్తిపాడు, వేమూరు, రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లి సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్‌కుమార్, వరికూటి అశోక్‌బాబు, పీటా నాగమోహనకృష్ణ బొల్లా బ్రహ్మనాయుడు, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షుడు గౌతంరెడ్డి, అసెంబ్లీ పరిశీలకులు నల్లమోతు రూత్‌రాణి, కాకుమాను సదాశివారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మదన్‌మోహన్ గౌడ్, నూతలపాటి హనుమయ్య, బాసు లింగారెడ్డి, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, గుత్తికొండ అంజిరెడ్డ, వై.మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, గడ్డేటి సురేంద్ర, మోపిదేవి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసి, బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్ మాట తడబడకుండా 10 సార్లు డీఎస్సీ అంటే తాము చర్చ నుంచి తప్పుకొంటామన్నారు. టీడీపీలోని దిగువ శ్రేణి నాయకులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఒక్కటే దిక్కు అన్న చంద్రబాబులో వైఎ్‌స్ జగన్ బాటలో మావిగన్ బెస్ట్ అనే విధంగా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఆటవిక చర్యలతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


